Sim Cards Block : 80 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఈ నిర్ణయానికి కారణమేంటంటే-80 lakh sim cards deactivated and lakhs of mobile number blocked india uses ai tools in strategy to tackle cybercrime ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sim Cards Block : 80 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఈ నిర్ణయానికి కారణమేంటంటే

Sim Cards Block : 80 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఈ నిర్ణయానికి కారణమేంటంటే

Anand Sai HT Telugu
Dec 17, 2024 01:01 PM IST

Sim Cards Block : సుమారు 80 లక్షల నకిలీ సిమ్ కార్డులను ప్రభుత్వం నిషేధించింది. ఈ సిమ్ కార్డులను తయారు చేసేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్టుగా గుర్తించారు. ఏఐ సాయంతో టెలికాం డిపార్ట్‌మెంట్ ఈ నకిలీ సిమ్ కార్డులను గుర్తించి నిలిపివేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. తాజాగా ఇటువంటి నేరాలను ఆపడానికి భారత ప్రభుత్వం 80 లక్షల సిమ్ కార్డులను నిషేధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాధనాలను ఉపయోగించి ప్రభుత్వం ఈ నకిలీ సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ఇది కాకుండా సైబర్ నేరాలకు పాల్పడిన 6.78 లక్షల మొబైల్ నంబర్లను కూడా క్లోజ్ చేశారు. టెలికాం సేవలను సురక్షితమైనదిగా చేయాలనే సంకల్పంతో డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ చర్య తీసుకున్నారు.

నిజానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం నకిలీ పత్రాలపై నమోదైన మొబైల్ నంబర్‌లను గుర్తించేందుకు ఏఐ ఆధారిత టూల్స్ వాడింది. ఈ ప్రక్రియలో 78.33 లక్షల నకిలీ మొబైల్ నంబర్లను గుర్తించి వాటిని వెంటనే నిలిపివేశారు. టెలికమ్యూనికేషన్స్ విభాగం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఈ సమాచారం ఇచ్చింది.

ఈ చర్యలో టెలికమ్యూనికేషన్స్ శాఖ, హోం మంత్రిత్వ శాఖ మధ్య సమన్వయం ముఖ్యమైన పాత్ర పోషించిందని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా 10 లక్షల ఫిర్యాదులు పరిష్కరించారు. రూ.3,500 కోట్ల రూపాయల మోసాన్ని నిరోధించారు.

డిసెంబర్ 11, 2024 నుండి టెలికాం కంపెనీలు ఫేక్ మెసేజ్‌లు పంపే వ్యక్తులను ట్రేస్ చేయగలవు. అక్టోబర్ 1, 2024 నుండి, టెలికాం కంపెనీలు నెట్‌వర్క్ స్థాయిలో నకిలీ కాల్‌లు, సందేశాలను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి

తాజాగా బ్లాక్ చేసిన 80 లక్షల సిమ్ కార్డులకు సరైన డాక్యుమెంటేషన్ లేకుండా జారీ అయ్యాయి. ప్రభుత్వం వాటిని మూసివేయాలని ఆదేశించింది. మీ సిమ్ కార్డ్ బ్లాక్ అయితే నెట్‌వర్క్ ఆపరేటర్‌ని సంప్రదించి సిమ్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధిత పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. సిమ్ కార్డులు చట్టవిరుద్ధంగా జారీ చేస్తే నెట్‌వర్క్ ఆపరేటర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సరైన పత్రాలను కలిగి ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు.

Whats_app_banner