ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు పెంచేందుకు టాటా మాస్టర్ ప్లాన్.. ఈ తేదీల్లో కొంటే 6 నెలలు ఫ్రీ ఛార్జింగ్!
Tata Electric Cars : టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ కార్లకు భారత మార్కెట్‌లో మంచి పేరు ఉంది. ఈ కంపెనీ తన అమ్మకాలు పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. 6 నెలలపాటు ఫ్రీ ఛార్జింగ్ ఆఫర్ ప్రకటించింది.
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లకు మండి డిమాండ్ ఉంది. ఈవీ రంగంలో టాటా అగ్రస్థానంలో ఉంది. టాటా తరచుగా మంచి ఆఫర్లు, ప్రయోజనాలను అందజేస్తుంది. నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ కొనుగోలుదారుల కోసం ఒక మంచి ప్లాన్‌ను పరిచయం చేసింది. అదేంటంటే డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 31, 2024 మధ్య ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో దేనినైనా కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఛార్జింగ్ ఉచితం. దేశవ్యాప్తంగా టాటా పవర్ ఈజెడ్ ఛార్జింగ్ స్టేషన్‌లలో ఉచిత ఛార్జింగ్ పొందుతారు. ఈ పథకం కేవలం ప్రైవేట్ వాహనాలకు మాత్రమేనని, ఫ్లీట్ వాహనాలకు వర్తించదని కంపెనీ ప్రత్యేకంగా తెలియజేసింది.
క్యాలెండర్ ఇయర్ చివరిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచేందుకు కంపెనీ రూపొందించిన ఈ ప్లాన్ పెద్ద హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఉచిత ఛార్జింగ్ పొందడానికి నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ కొనుగోలుదారులు తమ వాహనాన్ని టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉచిత ఛార్జింగ్ సేవలు యాక్టివ్‌గా ఉంటాయి.
యాప్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారులు కొనుగోలు చేసిన తేదీ నుండి 1,000 యూనిట్ల వరకు విద్యుత్ లేదా ఆరు నెలల ఉచిత ఛార్జింగ్‌కు అర్హులు అని టాటా మోటార్స్ ప్రకటించింది. పేర్కొన్న పవర్ పరిమితి లేదా సమయ పరిమితి తర్వాత ఛార్జింగ్ చేయడానికి ప్రామాణిక టారిఫ్ ఛార్జ్ చేస్తారు. ఈ కొత్త ఉచిత ఛార్జింగ్ స్కీమ్‌తో టాటా తన పాపులర్ మోడళ్ల అమ్మకాలను పెంచుకోవాలని చూస్తుంది.
నెక్సాన్ ఈవీ ప్రస్తుతం రూ.12.49 లక్షల నుండి రూ.17.19 లక్షల మధ్య ఉంది. కూపే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర 17.49 లక్షల నుండి 21.99 లక్షల మధ్య ఉంటుంది. నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వరుసగా 30kWh, 40.5kWh బ్యాటరీ ప్యాక్‌లతో మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మీడియం రేంజ్ మోడల్ ఒకే ఛార్జ్‌పై 325 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ పూర్తి ఛార్జ్‌పై 465 కి.మీల రేంజ్ ఇస్తుంది.
మరోవైపు కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. 45kWh, 55kWh. వీటికి వరుసగా 502 కి.మీ, 585 కిమీ రేంజ్‌ను కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఛార్జింగ్ విషయానికొస్తే ఫాస్ట్ ఛార్జింగ్‌తో దీనిని చేయవచ్చు. డీసీ ఛార్జింగ్ కర్వ్ ఈవీ బ్యాటరీ ప్యాక్‌ను 40 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. టాటా ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీ వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్ సామర్థ్యాలతో వస్తుంది. ఈ వాహనం క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ప్లస్ ఎ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.