Naga Chaitanya Sobhita: నాతో తెలుగులోనే మాట్లాడాలని శోభితకు చెబుతుంటాను: నాగ చైతన్య
Naga Chaitanya Sobhita: నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనతో తెలుగులోనే మాట్లాడాలని శోభితకు చెబుతుంటానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు. శోభిత కూడా విశాఖపట్నంకు చెందిన అమ్మాయి అన్న విషయం తెలిసిందే.
Naga Chaitanya Sobhita: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ఈ మధ్యే పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత ది న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. శోభితతో తన రిలేషన్షిప్ ఎప్పుడు ఎలా మొదలైంది, ఆమెలో తనకు నచ్చిన విషయాలు ఏంటి అనేవి పంచుకున్నాడు. అయితే తన తెలుగును మెరుగుపరచుకోవడానికి శోభితను తనతో తెలుగులోనే మాట్లాడాలని చెబుతానని అతడు వెల్లడించాడు.
తెలుగులోనే మాట్లాడతా
నాగ చైతన్య పుట్టింది హైదరాబాద్ లోనే అయినా.. పెరిగింది మాత్రం చెన్నైలో. సుమారు 20 ఏళ్ల పాటు అతడు అక్కడే ఉన్నాడు. దీంతో అతని మాతృభాష తెలుగు అయినా.. అక్కడ తమిళమే మాట్లాడేవాడు. స్కూలు, కాలేజీ చదువులన్నీ అక్కడే కావడంతో అది అతని తెలుగుపై ప్రభావం చూపింది. ఇప్పటికీ అతడు సరైన తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడతాడు. ఈ నేపథ్యంలోనే తన తెలుగు మెరుగుపరచుకోవడానికి శోభితను తనతో తెలుగులోనే మాట్లాడాలని చెబుతానని చైతన్య ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"ఇండస్ట్రీలో రోజూ వేర్వేరు భాషలకు చెందిన ఎంతో మంది భిన్నమైన వ్యక్తులను కలుస్తుంటాం. అయితే ఎవరితో అయినా తెలుగులోనే మాట్లాడితే వాళ్లకు నేను త్వరగా మరింత దగ్గరవుతాను. అందుకే తనకు నాతో తెలుగులోనే మాట్లాడాలని చెబుతూ ఉంటాను. దీనివల్ల నేను మెరగవుతాను" అని చైతన్య చెప్పాడు.
"సాధారణంగా మనం యాక్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు సినిమాలతోనో లేదంటే ఏదైనా ప్రోడక్ట్ గురించో మాట్లాడుతుంటాం. అలాంటప్పుడు ఏదైనా సాధారణమైన అంశం, ఓ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నేను వెంటనే ఆవైపు ఆకర్షితుడిని అవుతాను" అని చైతన్య తెలిపాడు.
చైతూ, శోభిత పెళ్లి
చైతూ, శోభిత 2022 నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లితో ఒక్కటైంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీళ్లు ఏడడుగులు వేశారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీటిలో ఒకదాంట్లో నాగ చైతన్య కాళ్లను శోభిత మొక్కడం చూసి కొందరు నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేశారు. ఈ కాలంలో ఇలాంటివి ఇంకా అవసరమా అని వాళ్లు స్పందించారు.
నాగ చైతన్య అంతకుముందు సమంతతో నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత 2021లో విడిపోయాడు. ఏడాది ఒంటరిగా ఉన్న తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం అతడు తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదో పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో సాయి పల్లవి కూడా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. మరోవైపు తెలుగు అమ్మాయి అయిన శోభిత మాత్రం తెలుగు కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ బిజీగా ఉంటోంది.
టాపిక్