T-Fiber Project : రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ..! కేంద్ర టెలికాం శాఖ మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. రాష్ట్రంలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు వివరించారు. ఇందుకోసం ఉద్దేశించిన టీ-ఫైబర్ ప్రాజెక్టుకు వడ్డీ రహిత రుణం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా టీ - ఫైబర్ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు తెలియజేశారు.
రూ. 300కే…
టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టూ గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటీజన్) కనెక్టివిటీ కల్పించడంతో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ-ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని తెలిపారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేంద్ర మంత్రి సింధియా దృష్టికి తీసుకెళ్లారు. రూ. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడి వ్యయం రూ. 1,779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఎఫ్ఓ) ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు.
జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్ఓఎఫ్ఎన్) మొదటి దశ మౌలికసదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ లైనియర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తుంటే... మిగితా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా టీ-ఫైబర్ నడుస్తోందని వివరించారు. ఈ రీత్యా నెట్ వర్క్ సమర్థ నిర్వహణ, వినియోగం కోసం సకాలంలో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ మౌలిక సదుపాయాలకు అందించాలని ప్రతిపాదించారు.
ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్ – 3 ఆర్కిటెక్చర్ కు మార్చడానికి గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ను పంపించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ డీపీఆర్‌ను త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ నెట్ – 3 ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల పౌరులకు ఈ-గవర్నెన్సును అందించగలుగుతామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనకు ఉద్ధేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.