Hyderabad : నారాయణ స్కూలులో స్టూడెంట్ సూసైడ్.. విద్యార్థి సంఘాల ఆందోళన
Hyderabad : చదువు చిన్నారులకు జ్ఞానం పెంచాలి కానీ.. భారం అవ్వకూడదని ఎందరో మహానుభావులు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం చదవంటే ఒత్తడిగా మారింది. దీంతో బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ విద్యా సంస్థల్లో చదివే వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో తీవ్ర విషాదం జరిగింది. నారాయణ స్కూల్‌లో చదివే ఏడో తరగతి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని విగతజీవిగా చూసి అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కొడుకు చావుకు కారణం నారాయణ విద్యాసంస్థల నిర్వాహకులేనని ఆరోపిస్తున్నారు.
ఏం జరిగింది..
బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. దాంట్లో లోహిత్ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా లోహిత్ చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నాడు. ఇదే విషయాన్ని పేరెంట్స్‌కు చెప్పాడు. వారు సర్దిచెప్పి పంపారు. ఈ నేపథ్యంలో.. సోమవారం హోస్టల్లో ఆత్మహత్మ చేసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు సిబ్బందికి సమాచారం అందించారు. కానీ.. ఇప్పటికే లోహిత్ మృతిచెందాడు.
ఈ విషయం తెలిసిన లోహిత్ తండ్రి.. విద్యార్ధి సంఘాల నాయకులతో కలిసి కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. లక్షలు పోసి స్కూలుకు పంపింతే.. కొడుకు శవాన్ని గిప్టుగా ఇచ్చారని రోదించారు. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యం, టీచర్ల వేధింపులు వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.
ఇది ఆత్మహత్యనా.. ఏమైనా చేశారా అనే అనుమానం ఉందన్నారు. తన కొడుకు చనిపోయిన విషయాన్ని ఆలస్యంగా చెప్పారని వివరించారు. చదువు విషయంలో తన కుమారుడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దని గతంలోనే చెప్పానని స్పష్టం చేశారు. చదువు ఒత్తిడి మాత్రమే కాకుండా.. ఈ స్కూల్ లో ఇంకా ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
గతంలోనూ..
గతంలోనూ నారాయణ విద్యా సంస్థల్లో చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. టీచర్లు, సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఇన్ని ఘటనలు జరుగుతున్నా.. ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.