ఆపిల్ ముక్కలు రంగు మారుతున్నాయా? స్నాక్ బాక్స్‌లో ఫ్రెష్‌గా ఉండడానికి ఈ సూపర్ చిట్కా మీకోసం-how to keep cut apples fresh tips and tricks to prevent browning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఆపిల్ ముక్కలు రంగు మారుతున్నాయా? స్నాక్ బాక్స్‌లో ఫ్రెష్‌గా ఉండడానికి ఈ సూపర్ చిట్కా మీకోసం

ఆపిల్ ముక్కలు రంగు మారుతున్నాయా? స్నాక్ బాక్స్‌లో ఫ్రెష్‌గా ఉండడానికి ఈ సూపర్ చిట్కా మీకోసం

HT Telugu Desk HT Telugu
Dec 17, 2024 02:00 PM IST

ఆపిల్ పండు కోసిన తరువాత ఆ ముక్కలు కొద్ది సేపటికే గోధుమ రంగులోకి మారడం సహజం. దీంతో పిల్లలు ఫ్రూట్ స్నాక్ బాక్స్‌లో వీటిని పంపిస్తామంటే వద్దని చెప్పేస్తారు. మరి యాపిల్ రంగు మారకుండా చేసేందుకు హిందుస్తాన్ టైమ్స్ పాఠకుల కోసం ఒక సూపర్ చిట్కా ఇక్కడ ఉంది చూడండి.

యాపిల్ రంగు మారకుండా చేసేందుకు చిట్కా
యాపిల్ రంగు మారకుండా చేసేందుకు చిట్కా (pixabay)

చలికాలంలో చాలా సందర్భాల్లో పిల్లలకు పంపే స్నాక్ బాక్స్ లేదా బ్రేక్ ఫాస్ట్ బాక్స్ లోని అల్పాహారం సాయంత్రానికి యథాతథంగా తిరిగి వచ్చేస్తుంది. చలి కారణంగా అల్పాహారం గట్టి పడడం, బాగా చల్లగా మారిపోవడంతో పిల్లలు వాటిని ముట్టనే ముట్టరు. అది ఇంటికే తిరిగి వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా పండ్లను పంపొచ్చు.

చలికాలంలో యాపిల్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. అయితే వీటిని కట్ చేసి పిల్లల స్నాక్స్ బాక్స్‌లో పంపాలని మనకు ఉంటుంది. కానీ అవి కొద్ది నిమిషాలకే గోధుమ రంగులోకి మారుతాయి. అలా చూస్తే పిల్లలు వాటిని కూడా ముట్టరు. రంగు పాలిపోవడమే కాకుండా ఆపిల్ రుచి కూడా ప్రభావితం అవుతుంది..ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఉంది.

యాపిల్స్ ఎందుకు గోధుమ రంగులో ఉంటాయి?

యాపిల్‌ను ముక్కలుగా చేసినప్పుడు దానిలోని కణాలకు ఆక్సిజన్ సోకడం వల్ల అది ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసే రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. ఇది పండ్లను ఆక్సీకరణం చేస్తుంది, దీంతో యాపిల్ ముక్కలు గోధుమ రంగులోకి మారుతాయి.

రంగు మారకుండా ఉండాలంటే

ఆపిల్ ముక్కలను తాజాగా, రుచికరంగా ఉంచడానికి ఇక్కడ సాధారణ ట్రిక్స్ చూడొచ్చు.

  1. నిమ్మరసం: నిమ్మరసంలోని ఆమ్ల స్వభావం ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఆపిల్ కోసినప్పుడు పైన కొంచెం తాజా నిమ్మరసాన్ని పిండండి. ఇక అది గోధుమ రంగులోకి మారడానికి అవకాశం ఉండదు.
  2. వెనిగర్: నిమ్మరసం మాదిరిగానే వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. నీరు, వెనిగర్ ద్రావణంలో ముంచి తీయడం వల్ల యాపిల్ ముక్కలు గోధుమ రంగులోకి మారవు.
  3. చల్లని నీరు: యాపిల్ ముక్కలను చల్లటి నీటిలో ముంచడం వల్ల గోధుమ రంగులోకి రాకుండా ఆపొచ్చు. నీరు ఆక్సిజన్, పండ్ల మధ్య అవరోధంగా పనిచేస్తుంది, ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదిస్తుంది.

ఇంట్లో నిల్వ చేయాల్సి వస్తే

యాపిల్ ముక్కల తాజాదనాన్ని కాపాడుకోవడానికి, వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. కొన్ని ఆపిల్ రకాలు కట్ చేసినప్పుడు తక్షణం గోధుమ రంగులోకి మారుతాయి. వాటిని పసిగట్టి ఇంకోసారి అలాంటి రకాలు తీసుకోకండి.

Whats_app_banner

సంబంధిత కథనం