Key Changes In NTA : ఎన్టీఏలో కీలక మార్పులు.. ఇక నిర్వహించేది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మాత్రమే.. నో రిక్రూట్‌మెంట్స్
Key Changes In NTA : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్జీఏ)లో ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఇకపై ఎన్టీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహించనుంది. రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నీట్, జేఈఈ మెయిన్, సీయూఈటీ, యూజీసీ నెట్ వంటి ముఖ్యమైన పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏ 2025 నుంచి ఉన్నత విద్యా సంస్థలకు మాత్రమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఎన్టీఏ రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించదు. వచ్చే ఏడాది ఎన్టీఏను పునర్వ్యవస్థీకరిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. పరీక్షా సంస్థలో కొత్తగా 10 పోస్టులను సృష్టించనున్నారు.
సమీప భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టెక్నాలజీ ఆధారిత ప్రవేశ పరీక్ష దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌పై మాట్లాడుతూ నీట్ యూజీ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించాలా లేక ఆన్ లైన్ లో నిర్వహించాలా అనే విషయంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీని ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 2025లో ఏజెన్సీని పునర్ వ్యవస్థీకరిస్తామని, కనీసం 10 కొత్త పోస్టులను సృష్టిస్తున్నామని చెప్పారు. పనిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్టీఏ పనితీరులో పలు మార్పులు చేయనున్నారు.
భవిష్యత్తులో కంప్యూటర్ అడాప్టివ్ టెస్ట్‌లు, టెక్నాలజీ ఆధారిత ప్రవేశ పరీక్షల వైపు అడుగులు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. నీట్ యూజీ 2024, యూజీసీ నెట్‌లో అవకతవకలు బట్టబయలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పనితీరును, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ అనేక సంస్కరణలను సిఫారసు చేసింది. అవి ఏంటంటే..
- జేఈఈ మెయిన్ మాదిరిగానే నీట్‌ను కూడా ఒకటి కంటే ఎక్కువ దశల్లో నిర్వహించాలి.
- ఆఫ్‌లైన్ పరీక్షలను తగ్గించాలి. ఆన్‌లైన్ విధానంలో సాధ్యం కాని చోట హైబ్రిడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పెన్ పేపర్ మోడ్) పరీక్షలకు ఆప్షన్ ఉండాలి.
- మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ సహా ప్రధాన పరీక్షల్లో ప్రయత్నాల సంఖ్యను పరిమితం చేయాలి.
- సీయూఈటీ పరీక్షలో సబ్జెక్టుల సంఖ్యను తగ్గించాలి.
- ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాత్రను తగ్గించాలి. ప్రైవేటు సెంటర్ల సంఖ్యను తగ్గించాలి.
- ఎన్టీఏలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య పెంచాలి.
వచ్చే ఏడాది నుంచి జేఈఈ, నీట్ సహా ఇతర కేంద్ర పోటీ పరీక్షల్లో పలు మార్పులు చేయనున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర చెప్పారు. దీని నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా తీసుకోనున్నారు. ఈ పరీక్షలను వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఎన్టీఏ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ ఘటన తర్వాత విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.