UGC NET December 2024: ఈ రోజు రాత్రి వరకే యూజీసీ నెట్ డిసెంబర్ 2024 అప్లికేషన్ కరెక్షన్ విండో
UGC NET December 2024: యూజీసీ నెట్ డిసెంబర్ 2024 అప్లికేషన్ కరెక్షన్ విండో ప్రస్తుతం యాక్టివ్ గా ఉంది. ఈ విండో ఎప్పటి వరకు ఓపెన్ గా ఉంటుందో ఎన్టీఏ వెల్లడించింది. ugcnet.nta.ac.in. వెబ్ సైట్ ద్వారా యూజీసీ నెట్ దరఖాస్తులో విద్యార్థులు మార్పులు చేసుకోవచ్చు.
UGC NET December 2024: యూజీసీ నెట్ డిసెంబర్ 2024 దరఖాస్తు కరెక్షన్ విండో సమయం డిసెంబర్ 14, 2024 శనివారం రాత్రితో ముగుస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. దరఖాస్తులు సమర్పించి, అందులో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ యూజీసీ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in ద్వారా మార్పులు చేసుకోవచ్చు.
ఈ సమయం వరకే..
యూజీసీ నెట్ (ugc net) డిసెంబర్ 2024 అప్లికేషన్ కరెక్షన్ విండో డిసెంబర్ 14, 2024 శనివారం రాత్రి 11:59 వరకే యాక్టివ్ గా ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఆ తరువాత ఆ లింక్ అందుబాటులో ఉండదని, విద్యార్థులు తమ దరఖాస్తులో మార్పులు చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 దరఖాస్తుల్లో దిద్దుబాట్లు చేయడానికి డైరెక్ట్ లింక్
అభ్యర్థులు 2024 డిసెంబర్ 14 నాటికి (రాత్రి 11:59 గంటల వరకు) తమ దరఖాస్తుల్లో అనుమతించిన మేరకు దిద్దుబాట్లు చేయడానికి వీలు ఉంటుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థుల వివరాల్లో ఎలాంటి సవరణలను అనుమతించబోము’’ అని ఎన్టీఏ (NTA) వెల్లడించింది. అదనపు రుసుము (వర్తించే చోట) సంబంధిత అభ్యర్థి క్రెడిట్ / డెబిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ లేదా యుపిఐ ద్వారా చెల్లించాలని తెలిపింది. అభ్యర్థులకు ఇది వన్ టైమ్ సదుపాయం కాబట్టి, అభ్యర్థులు జాగ్రత్తగా దిద్దుబాటు చేయాలని సూచించింది.
జనవరి 1 నుంచి పరీక్షలు
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 రిజిస్ట్రేషన్లు నవంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 11, 2024తో ముగిశాయి. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 12, 2024. అధికారిక షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 1 నుంచి 19 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. ఎగ్జామ్ (EXAMS) సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్, అడ్మిట్ కార్డు (admit card) లను సమయానుకూలంగా విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మంజూరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం, పీహెచ్డీలో ప్రవేశం కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి యూజీసీ-నెట్ నిర్వహిస్తారు.
యూజీసీ నెట్ జూన్ రీ ఎగ్జామ్ ఫలితాలు
యూజీసీ నెట్ జూన్ రీ ఎగ్జామ్ ఆగస్టు 21, 22, 23, 27, 28, 29, 30, సెప్టెంబర్ 2, 3, 4, 5 తేదీల్లో జరిగింది. మొత్తం 11,21,225 మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా వారిలో 6,84,224 మంది మాత్రమే హాజరయ్యారు. 4,37,001 మంది అభ్యర్థులు రీ టెస్ట్ కు గైర్హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ పరీక్షలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు 4,970 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 53,694 మంది, పీహెచ్ డీ ప్రవేశాలకు 1,12,070 మంది అర్హత సాధించారు. మరిన్ని వివరాలకు 011-40759000 నంబరులో సంప్రదించవచ్చు లేదా ugcnet@nta.ac.in ఈమెయిల్ చేయవచ్చు.