Narayana College Student : నారాయణ కాలేజీల్లో ఆగని ఆత్మహత్యలు, బొల్లారం క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్!-narayana college bollaram inter first year student committed suicide parents relatives protesting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Narayana College Student : నారాయణ కాలేజీల్లో ఆగని ఆత్మహత్యలు, బొల్లారం క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్!

Narayana College Student : నారాయణ కాలేజీల్లో ఆగని ఆత్మహత్యలు, బొల్లారం క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్!

Bandaru Satyaprasad HT Telugu
Nov 05, 2024 02:17 PM IST

Narayana College Student : హైదరాబాద్ బొల్లారం పరిధిలోని నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.

నారాయణ కాలేజీల్లో ఆగని ఆత్మహత్యలు, బొల్లారం క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్!
నారాయణ కాలేజీల్లో ఆగని ఆత్మహత్యలు, బొల్లారం క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్! (HT)

నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే...బొల్లారం క్యాంపస్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా బొల్లారం నారాయణ కాలేజీలో... హనుమకొండ జిల్లా గరిమెళ్లపల్లికి చెందిన బాలబోయిన పరుశురామ్‌ కూతురు వైష్ణవి (16)...ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. కాలేజీ హాస్టల్‌లో సోమవారం సాయంత్రం వైష్ణవి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థిని గమనించిన ఆమె స్నేహితులు కాలేజీ యాజమాన్యానికి తెలియజేశారు. కాలేజీ సిబ్బంది బాలికను బాచుపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా ఆమె మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ గంగాధర్‌ తెలిపారు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామానికి శివారులో నారాయణ కాలేజీ క్యాంపస్ ఉంది. ఇందులో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్న వైష్ణవి... తన గదిలో ఎవ‌రు లేని స‌మ‌యంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే వైష్ణవి గది హాస్టల్ సెకండ్ ఫ్లోర్ లోని 219 కాగా, ఆమె 315 రూమ్ లోకి వచ్చి సూసైడ్ చేసుకుంది. తోటి విద్యార్థులు కాలేజీ సిబ్బంది తెలపగా.. వారు బాలికను బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థిని అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

విద్యార్థిని ఆత్మహ‌త్యకు కార‌ణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. తమ బిడ్డ మరణానికి కారణాలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఇక్కడికి పంపితే...ఇక్కడి సిబ్బంది ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద ఆందోళన చేప‌ట్టాయి.

బాచుపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరవకముందే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలపై నారాయ‌ణ కాలేజీ యాజ‌మాన్యంపై ఎందుకు చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వైష్ణవి ఆత్మహ‌త్యకు గల కార‌ణాలను కాలేజీ యాజ‌మాన్యం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి, కాలేజీ యాజమాన్యం ర్యాంకుల కోసం వ్యవహరిస్తున్న తీరు ఇలాంటి ఘటనలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కాలేజీలోని తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. హాస్టల్ కిటికీల నుంచి బిక్కు బిక్కుమంటూ బయటకు చూస్తూ తమ తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తున్నట్టు విద్యార్థులు కనిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ నారాయణ కాలేజీల్లో జరుగుతుండడంతో తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు.

Whats_app_banner