IND vs AUS: ఆఖర్లో వచ్చి గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాని ఆ ఇద్దరూ దెబ్బతీశారు.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన కోచ్
IND vs AUS 3rd Test: ఆస్ట్రేలియాకి మూడో టెస్టులో గెలిచే అవకాశాల్ని బుమ్రా, ఆకాశ్ దీప్‌లు బ్యాటింగ్‌తో దూరం చేశారని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ వెటోరి అంగీకరించాడు. భారత్‌ను ఫాలో ఆన్ నుంచి తప్పించిన ఈ జంట
ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బౌలింగ్ జోడి జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ బ్యాట్‌తో సత్తాచాటి టీమ్‌కి ఫాలో ఆన్ గండం తప్పించారు. భారత్ జట్టుని 246 పరుగులు లోపే ఆలౌట్ చేసి ఫాలో ఆన్ ఆడించాలని ఆస్ట్రేలియా టీమ్ మంగళవారం ప్లాన్ చేసుకుందట. కానీ.. తమ ఫాలో ఆన్ ప్రణాళికను బుమ్రా, ఆకాశ్ జోడి విఫలం చేసిందని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరి అంగీకరించాడు.
తప్పిన ఫాలో ఆన్ గండం
కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) సమయోచిత ఇన్నింగ్స్ ఆడిన తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా (10 నాటౌట్), ఆకాశ్ దీప్ (27 నాటౌట్) ఆఖరి వికెట్‌కి అజేయంగా 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో భారత్ జట్టుకి ఫాలో ఆన్ ప్రమాదం తప్పింది. వాస్తవానికి ఆకాశ్ దీప్ క్రీజులోకి వచ్చేసరికి భారత్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు కాగా, ఫాలోఆన్‌ను తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో ఈ జంట అద్వితీయ ప్రదర్శన కనబర్చింది.
ఆ ఇద్దరే హీరోలు
మంగళవారం ఆట అనంతరం వెటోరి మాట్లాడుతూ ‘‘మ్యాచ్‌లో ఫలితం రాబట్టాలంటే ఉన్న ఏకైక మార్గం భారత్‌ను ఫాలో ఆన్ ఆడించడమేనని మేము అనుకున్నాం. జడేజా ఔటైనప్పుడు మాకు మంచి అవకాశం ఉందని సంబరపడ్డాం. కానీ.. బుమ్రా, ఆకాశ్ దీప్ కష్టమైనప్పటికీ.. అసాధారణ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో.. దురదృష్టవశాత్తూ మ్యాచ్‌లో మాకు చాలా సమయం వృథా అయ్యింది’’ అని చెప్పుకొచ్చాడు.
డిక్లేర్ చేయకుండా తప్పు చేసిందా?
ఆస్ట్రేలియా రెండో రోజు ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసినప్పటికీ ఆ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయకుండా మూడో రోజు ఆటను కొనసాగించింది. ఆఖరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకి ఆలౌటైంది. జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంలో జాప్యం చేసిందా? అని అడిగిన ప్రశ్నకు వెటోరి సమాధానమిస్తూ.. ‘‘లేదు, నేను అలా అనుకోవడం లేదు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ పరుగులు చాలా కీలకం అని మాకు తెలుసు. వాతావరణం భిన్నంగా మారడంతో తప్పలేదు’’ అని వెల్లడించాడు.
ఇక డ్రా లాంఛనమే
మ్యాచ్‌లో నాలుగో రోజైన మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 252/9తో ఉంది. ఇంకా 193 పరుగులు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉండగా.. ఇక బుధవారం ఆట మాత్రమే మిగిలి ఉంది. దాంతో మ్యాచ్ డ్రా అవడం లాంఛనంగానే కనిపిస్తోంది.