CM Chandrababu : మంగళగిరి ఎయిమ్స్‌లో రోగులకు రూ.10కే వైద్య సేవలు అభినందనీయం- సీఎం చంద్రబాబు
CM Chandrababu : టెక్నాలజీ సాయంతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి హాజరైన సీఎం...ఎయిమ్స్ లో రూ.10కే అందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నారన్నారు.
CM Chandrababu : మెడికల్ సైన్స్‌లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా వైద్యరంగంలో అద్భుతాలు సాధించవచ్చని, టెక్నాలజీ ద్వారా రోగుల చెంతకే వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్‌టెక్ సైన్స్ అయ్యిందన్నారు. డీప్‌టెక్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్ధులు పట్టు సాధించాలని, రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆస్పత్రులు రాకుండా వైద్య చికిత్స అందించేలా వైద్యరంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని చెప్పారు. మంగళవారం మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన మొదటి స్నాతకోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి.. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రపతి ముర్ము అందరికీ స్ఫూర్తి
ఒడిశాలోని ఒక మారుమూల గ్రామంలోని గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము వచ్చారని, రాష్ట్రపతి స్థాయి వరకు ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ప్రొఫెసర్‌గా, జూనియర్ అసిస్టెంట్‌గా, కౌన్సిలర్‌గా, చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారని.. దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని..అంతే పట్టుదలగా కష్టపడితే ఎవరైనా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని రాష్ట్రపతి నిరూపించారని ముఖ్యమంత్రి అన్నారు.
ఎయిమ్స్‌కు సంపూర్ణ సహకారం
మంగళగిరి ఎయిమ్స్‌కు దేశంలో మరే ఎయిమ్స్‌కు లేనట్టుగా 183 ఎకరాల భూమి ఇచ్చామని, అదికూడా అత్యుత్తమ ప్రాంతాన్ని ఎంపిక చేసి కేటాయించామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం మరింత భూమిని ఇవ్వాల్సిందిగా ఇటీవల ఎయిమ్స్ అధికార వర్గాలు తనను కోరాయని, త్వరలోనే మరో 10 ఎకరాలు ఎయిమ్స్‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. 2018లో తమ ప్రభుత్వ హయాంలోనే ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశామని, 960 బెడ్లతో రూ.1618 కోట్లతో దీనిని నిర్మించారని.. 9 ఏళ్లలో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందదాయకమని చెప్పారు.
ఎయిమ్స్‌కు అప్రోచ్ రోడ్లు, జాతీయ రహదారితో అనుసంధానించడం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, భవిష్యత్‌లో మరింతగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో రోగులకు రూ.10కే వైద్య సేవలు అందించడాన్ని ఆయన అభినందించారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రస్తుతం ర్యాకింగ్‌లో దేశంలో 8వ స్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో ఉండాలనేది తన ఆకాంక్షని చెప్పారు.
కేంద్రం ఎంతో అండగా ఉంది
ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ సహా పలు కేంద్ర విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి నగరాన్ని వచ్చే మూడేళ్లలో దాదాపు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసి అత్యద్భుతంగా నిర్మిస్తామని చెప్పారు. ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు.