Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. ఆసుప‌త్రికెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. భార్య క‌ళ్లెదుటే భ‌ర్త మృతి-army jawan dies in road accident in vizianagaram district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. ఆసుప‌త్రికెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. భార్య క‌ళ్లెదుటే భ‌ర్త మృతి

Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. ఆసుప‌త్రికెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం.. భార్య క‌ళ్లెదుటే భ‌ర్త మృతి

HT Telugu Desk HT Telugu
Dec 17, 2024 04:32 PM IST

Vizianagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం జరిగింది. భార్య క‌ళ్లెదుటే ఆర్మీ జవాన్ అయిన భ‌ర్త మృతి చెందారు. గ‌ర్భ‌వ‌తి అయిన భార్య‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్లి, తీసుకొస్తుండ‌గా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో.. ఆయ‌న మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో భార్య‌కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.

భార్య క‌ళ్లెదుటే భ‌ర్త మృతి
భార్య క‌ళ్లెదుటే భ‌ర్త మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లా కాపుశంభాం-అప్ప‌న్న‌వ‌ల‌స జంక్ష‌న్ మ‌ధ్య సోమ‌వారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మెర‌క‌మూడిదాం మండ‌లం భీమ‌వ‌రం గ్రామానికి చెందిన బంద‌పు ఈశ్వ‌రరావు (33), వినూత్న భార్య భ‌ర్త‌లు. వీరికి రెండేళ్ల కిందటే పెళ్లి అయింది. ఈశ్వ‌ర‌రావు బీహార్‌లోని గ‌యాలో ఆర్మీ జ‌వాన్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

yearly horoscope entry point

ఇటీవ‌లి సెల‌వుల‌పై ఇంటికి వ‌చ్చిన ఈశ్వ‌ర‌రావు.. భార్య వినూత్న గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో ఆమెను వైద్య ప‌రీక్ష‌ల కోసం చీపురుప‌ల్లిలోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. సోమ‌వారం సాయంత్రం వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం తీసుకురావాల‌ని ఆసుప‌త్రి ల్యాబ్ నిర్వ‌హ‌కులు చెప్పారు. సోమ‌వారం సాయంత్రం భార్య‌ను తీసుకుని ద్విచ‌క్ర వాహ‌నంపై చీపురుప‌ల్లి ఆసుప‌త్రికి ఈశ్వ‌ర‌రావు బ‌య‌లుదేరారు.

మార్గ‌మ‌ధ్యలో చీపురుప‌ల్లి-రాజాం ప్ర‌ధాన ర‌హ‌దారిలో గ‌రివిడి మండ‌లం కాపుశంభాం-అప్ప‌న్న‌వ‌ల‌స జంక్ష‌న్ వద్ద.. ఎదురుగా వ‌స్తున్న గుర్తు తెలియ‌ని వాహ‌నం, వీరు ప్ర‌యాణిస్తున్న ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొంది. వెంట‌నే భార్య‌, భ‌ర్త‌లిద్ద‌రూ కింద‌ప‌డ్డారు. తీవ్ర‌గాయాల‌తో ఉన్న వీరిని స్థానికులు హుటాహుటినా 108లో చీపురుప‌ల్లి ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మార్గ‌మ‌ధ్య‌లో ఈశ్వ‌ర‌రావు మృతి చెందారు. భార్య‌కు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చేరారు. ఆమెకు ఒక కాలు విరిగింది. వినూత్న ప‌రిస్థితి విష‌మంగా ఉంది. చీపురుప‌ల్లిలో ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం, మెరుగైన వైద్యం కోసం ఆమెను విజ‌య‌న‌గం జిల్లా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. భర్త మ‌ర‌ణంతో ఆమె తీవ్రంగా రోదిస్తుంది. ఈ ఘ‌ట‌న‌తో భీమ‌వ‌రం గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

స‌మాచారం అందుకున్న గరివిడి ఎస్ఐ లోకేశ్వ‌ర‌రావు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాహన డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్నాడ‌ని, నిందితుడి కోసం గాలిస్తున్నామ‌ని ఎస్ఐ లోకేశ్వ‌ర‌రావు చెప్పారు. ఈశ్వ‌ర‌రావు మృత‌దేహానికి పోస్టుమార్టం చేసి, కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner