AP Paper Leak : ఏపీలో పేపర్ లీక్ కలకలం, ఆన్ లైన్ లో మ్యాథ్స్ పేపర్- ఆ పరీక్షలు రద్దు
AP Paper Leak : ఏపీలో పదో తరగతి పేపర్ లీక్ కలకలం రేపింది. టెన్త్ సమ్మేటివ్ పరీక్ష మ్యాథ్స్ పేపర్ ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ పరీక్షను రద్దు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టింది.
AP Paper Leak : రాష్ట్రంలో పేపర్ లీక్ కలకలం రేపింది. దీంతో ఆ పరీక్షను రాష్ట్ర విద్యాశాఖ రద్దు చేసింది. రద్దు చేసిన ఆ పరీక్షను ఈనెల 20 నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. పరీక్షా ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో వెలుగులోకి వచ్చాయి.
పదో తరగతి అర్ధ సంవత్సర (సమ్మేటివ్) పరీక్ష పేపర్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైయ్యాయి. దీంతో సోమవారం జరగాల్సిన మ్యాథ్స్ పరీక్ష ప్రారంభానికి గంట ముందే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. దీంతో పాఠశాల విద్యాశాఖ అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. రీజనల్ జాయింట్ డైరెక్టర్లు (ఆర్‌జేడీ), జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవో)లకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించి పరీక్షలను నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయరామ రాజు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన గణితం పరీక్షలను రద్దు చేశారు.
విద్యా శాఖ మెసేజ్ ఇలా ఉంది?
వెంటనే తీసుకోవల్సిన చర్యలు, సమ్మేటివ్-1 మ్యాథమెటిక్స్ పరీక్షను వెంటనే వాయిదా వేయండి. ఈ మేసేజ్‌ను అన్ని స్కూల్స్‌కు పంపండి. సమాధానాలతో మ్యాథమెటిక్స్ పరీక్ష ప్రశ్నాపత్రం యూట్యూబ్‌లో సర్క్యులేట్ అవుతోంది. అలాగే వాట్స్‌యాప్, టెలిగ్రామ్‌లోనూ కూడా సర్క్యులేట్ అవుతోంది. రాష్ట్ర స్థాయిలో దీనిని తీవ్రమైన అంశంగా తీసుకున్నాం. ఈ మెసేజ్‌ను అన్ని స్కూల్స్‌కు పంపండి. రేపటి ప్రశ్నపత్రం పంపిణీకి చాలా తీవ్రమైన చర్యలు తీసుకోండి అని మెసేజ్‌లో రాసి ఉంది. అయితే సీల్డ్ కవర్‌లో ఎంతో పకడ్బందీగా అత్యంత రక్షణలో ఉండే పరీక్ష పత్రాలు రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో లీకైంది. అయితే పేపర్ ఎలా లీకైందో ఇప్పటి వరకు తెలియలేదు.
20న రద్దు అయిన పరీక్ష
అయితే రద్దు చేసిన లెక్కల పరీక్షను ఈనెల 20న నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. పేపర్ లీక్ వ్యవహారంలో విద్యా శాఖ నిర్లక్ష్యం స్పష్టం చేస్తోంది. సీల్డు కవర్‌లో ఉంచాల్సిన పేపర్లను ఓపెన్‌గా ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మెటివ్, సమ్మేటివ్-1 అసెస్‌మెంట్ల పరీక్ష పేపర్లు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ (ఎంఈవో) (మండల రిసోర్సు సెంటర్ల)ల్లో భద్రపరుస్తారు. పరీక్ష జరిగిన రోజు ఉదయం సంబంధిత పాఠశాల పరీక్ష ఇన్‌చార్జి ఉపాధ్యాయుడు వెళ్లి ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షా పేపర్లను ఎంఈవో నుంచి తీసుకుని తమతమ పాఠశాలకు తీసుకెళ్తారు. అక్కడ ఉపాధ్యాయుల సమక్షంలో సీలు తెరుస్తారు. ఇలా పకడ్బందీ వ్యవస్థ ఉన్నప్పుడు పరీక్ష పేపర్లు యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది.
పోలీస్ స్టేషన్లలో పరీక్ష పేపర్లు
డిసెంబర్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు సమ్మేటివ్-1 పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. అయితే వివిధ కారణాలతో పరీక్షలు డిసెంబర్ 11 నుంచి ప్రారంభమైయ్యాయి. ఇప్పటి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పేపర్ల పరీక్షలు పూర్తి అయ్యాయి. మేథ్స్ పేపర్ జరగాల్సి ఉండగా దాన్ని రద్దు చేశారు. దాన్ని ఈనెల 20న (శుక్రవారం) నిర్వహించనున్నారు. అయితే పేపర్ లీక్ కావడం వ్యవహారంతో దిద్దుబాటు చర్యలకు విద్యా శాఖ ఉపక్రమించింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంది. ఇక నుంచి ఏ రోజుకు ఆ రోజే ప్రశ్నా పత్రాలు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ ప్రశ్నాపత్రాలకు కస్టోడియన్లగా మండల విద్యా శాఖ అధికారులు (ఎంఈవో)లు ఉంటారని రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయరామ రాజు ఆదేశాలు జారీ చేశారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం