Kothimeera Recipes: కొత్తిమీర ఆవకాయ సరైన కొలతలతో ఇలా పెట్టేయండి, రుచి మామూలుగా ఉండదు-kothimeera pachadi recipe in telugu know how to make this nilva chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kothimeera Recipes: కొత్తిమీర ఆవకాయ సరైన కొలతలతో ఇలా పెట్టేయండి, రుచి మామూలుగా ఉండదు

Kothimeera Recipes: కొత్తిమీర ఆవకాయ సరైన కొలతలతో ఇలా పెట్టేయండి, రుచి మామూలుగా ఉండదు

Haritha Chappa HT Telugu
Dec 17, 2024 05:30 PM IST

Kothimeera Recipes: కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర రైస్ ఏవైనా కూడా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మేము కొత్తిమీర ఆవకాయ లేదా కొత్తిమీర నిల్వ పచ్చడి రెసిపీ ఇచ్చాము. దీన్ని ప్రయత్నించండి.

కొత్తిమీర ఆవకాయ
కొత్తిమీర ఆవకాయ

బిర్యానీకైనా ,పచ్చడికైనా, కూరలకైనా కొత్తిమీర కలిపి చేస్తే ఆ రుచే వేరు. ప్రతిరోజూ కొత్తిమీర పచ్చడితో ఒక ముద్ద అన్నం తింటే నోరూరిపోవడం ఖాయం. అందుకే మేము ఇక్కడ కొత్తిమీర ఆవకాయ రెసిపీ ఇచ్చాము. కొంతమంది దీన్ని కొత్తిమీర నిల్వ పచ్చడి అని కూడా పిలుచుకుంటారు. ఏది ఏమైనా ఈ కొత్తిమీర పచ్చడి రుచి మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే రెండు మూడు నెలలు తాజాగా ఉంటుంది.

కొత్తిమీర ఆవకాయ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కొత్తిమీర తరుగు - నాలుగు కప్పులు

చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజులో

వేడి నీళ్లు - ఒక కప్పు

నూనె - ఒక కప్పు

మెంతులు - ఒక స్పూను

ఆవాలు - ఒకటిన్నర స్పూను

పచ్చిశనగపప్పు - రెండు స్పూన్లు

మినప్పప్పు - రెండు స్పూన్లు

వెల్లుల్లి రెబ్బలు - 10

కరివేపాకులు - గుప్పెడు

ఎండుమిర్చి - ఆరు

జీలకర్ర - ఒక స్పూను

కారం - అరకప్పు

కొత్తిమీర ఆవకాయ రెసిపీ

1. కొత్తిమీరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. చింతపండును వేడి నీళ్లలో వేసి నానబెట్టాలి. వేడి తగ్గాక చేత్తోనే చింతపండును పిసికి గుజ్జులాగా చేసుకోవాలి.

3. శుభ్రంగా కడిగిన కొత్తిమీరను తడి లేకుండా పల్చటి వస్త్రంపై ఆరబెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. రెండు స్పూన్ల నూనె వేయాలి. అందులో కొత్తిమీర మొత్తాన్ని వేసి మెత్తగా వేయించుకోవాలి.

6. వేయించిన కొత్తిమీరను తీసి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు అదే కళాయిలో మరొక రెండు స్పూన్ల నూనె వేసి చింతపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి.

8. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.

9. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి అందులో మెంతులు, ఆవాలు వేసి వేయించాలి.

10. ఈ రెండింటినీ పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.

11. స్టవ్ మీద మరొక కళాయి పెట్టి కప్పు నూనెను వేయాలి.

12. ఆ కప్పు నూనెలో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి. ఈ తాలింపును పక్కన పెట్టుకోండి.

13. మిక్సీ జార్లో వేయించిన కొత్తిమీర, చింతపండు మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోండి.

14. ఆ కొత్తిమీర మిశ్రమంలోనే మెంతి ఆవాలు కలిపి చేసిన పొడిని, కారాన్ని వేసి చేత్తోనే బాగా కలపండి.

15. ఆ తర్వాత ఈ తాలింపును ఆ చట్నీపై వేసి స్పూన్ తో కలుపుకోండి.

16. అంతే టేస్టీ కొత్తిమీర ఆవకాయ రెడీ అయినట్టే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

వేడివేడి అన్నంలో రెండు ముద్దలు ఈ పచ్చడిని కలుపుకొని తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. చేస్తుండగానే తినాలన్నా కోరిక పుట్టేస్తుంది. ఒక్కసారి చేసుకుంటే నెల నుంచి రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది ఈ పచ్చడి.

తెలుగువారికి నిల్వ పచ్చళ్ళు అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ మేము కొత్తిమీర ఆవకాయ రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిల్వ పచ్చళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి కొన్ని పోషకాలు అందుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. బయటకొనే పచ్చళ్ళ కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుని తినడం వల్ల పరిశుభ్రంగా కూడా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ కొత్తిమీర ఆవకాయ ఒకసారి ప్రయత్నించండి.

Whats_app_banner