Kothimeera vada: కొత్తిమీర వడలు రెసిపీ చలికాలంలో తినాలనిపించే స్నాక్స్ ఇలా చేసేయండి
Kothimeera vada: కొత్తిమీరతో చేసిన ఏ ఆహారమైనా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక్కడ మేము కొత్తిమీర వడలను ఎలా చేయాలో ఇచ్చాము. ఈ రెసిపీ అందరికీ సులువుగానే ఉంటుంది.
కొత్తిమీర ఏ కాలంలోనైనా తినాల్సిన ముఖ్యమైన పోషకాహారం. దీనిలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కొత్తిమీరను బిర్యానీ, కూరల్లో గార్నిషింగ్ కోసం వాడతారు. నిజానికి దీంతో ఆహారాన్ని వండితే మనకున్న ఎన్నో పోషకాహార లోపాలు తీరిపోతాయి. ఇక్కడ మేము కొత్తిమీర వడలను ఎలా చేయాలో ఇచ్చాము. ఇది చాలా సింపుల్ రెసిపీ ఒక్కసారి చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం.
కొత్తిమీర వడలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కొత్తిమీర తరుగు - రెండు కప్పులు
శెనగపిండి - ఒక కప్పు
బియ్యప్పిండి - పావు కప్పు
పచ్చిమిర్చి పేస్టు - ఒక స్పూను
అల్లం పేస్టు - ఒక స్పూను
వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
చింతపండు గుజ్జు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
కారం - ఒకటిన్నర స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
నువ్వులు - ఒక స్పూను
బేకింగ్ సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర వడలు రెసిపీ
1. ఒక గిన్నెలో కొత్తిమీర తరుగును వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అదే కొత్తిమీరలో శెనగపిండి, బియ్యప్పిండి, పచ్చిమిర్చి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
3. ఆ తర్వాత పసుపు, కారం, వెల్లుల్లి పేస్టు, అల్లం పేస్టు, చింతపండు గుజ్జు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
4. ఇది చాలా గట్టిగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.
5. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని రోల్ చేసి లావుగా స్తూపం ఆకారంలో చేత్తోనే మెదుపుకోవాలి.
6. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో పెట్టాలి.
7. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి కింద నీళ్లు వేయాలి.
8. ఆ నీటి మీద స్టాండ్ పెట్టి ఈ స్థూపాకారంలో ఉన్న కొత్తిమీర మిశ్రమాన్ని దానిపై పెట్టి పైన మూత పెట్టి పది నిమిషాలు ఆవిరి మీదే ఉడికించాలి.
9. మూత తీసి స్థూపాకారపు కొత్తిమీర మిశ్రమాన్ని తీసుకొని గుండ్రంగా చివరి నుంచి కట్ చేసుకుంటూ రావాలి. అవి వడల్లాగా వస్తాయి.
10. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
11. ఆ నూనెలో కట్ చేసుకున్న కొత్తిమీర వడలను అందులో వేసుకొని వేయించాలి.
12. అవి క్రిస్పీగా వేగేదాకా ఉంచి వాటిని తీసి టిష్యూ పేపర్ పై వేసుకోవాలి. అంతే టేస్టీ కొత్తిమీర వడలు రెడీ అయినట్టే.
13. దీన్ని కెచప్ తో తింటే రుచి అదిరిపోతుంది.
14. అలాగే పుదీనా చట్నీతో తిన్నా రుచిగా ఉంటుంది. ఒకసారి వీటిని చేసుకుని చూడండి. మీకే నచ్చుతుంది. అలాగే పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి.
మీకు దీన్ని ఆవిరి మీద ఉడికించడం ఇష్టం లేకపోతే... చిన్న చిన్న ముద్దలను తీసుకొని వడల్లా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకోవచ్చు. పైన నువ్వుల నుంచి అల్లుకుని తింటే టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి దీన్ని అతిధులకు వడ్డించి చూడండి. మీకు కచ్చితంగా ప్రశంసలు దక్కుతాయి.