ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూల్ మెసేజ్ ఫీచర్.. ముందుగానే టైప్ చేసి డేట్, టైమ్ పెట్టేస్తే చాలు
Instagram schedule message feature : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ వచ్చింది. ఇకపై మీరు టైమ్ అండ్ డేట్ సెట్ చేసి పెడితే ఆ సమయానికి మెసేజ్ వెళ్లిపోతుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ తీసుకొచ్చింది.
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు నిరంతరం కొత్త ఫీచర్లను అందిస్తోంది. వినియోగదారులకు నచ్చే అప్‌డేట్ తీసుకొస్తుంది. ఇప్పుడు దాని డైరెక్ట్ మెసేజెస్ విభాగం అప్డేట్‌తో వచ్చింది. ఇప్పుడు యూజర్లకు డైరెక్ట్ మెసేజ్‌ను షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. చాలా రోజుల ముందుగానే సందేశాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసిన టైమ్ అండ్ డేట్ ప్రకారం మెసేజ్ వెళ్తుంది. సమయానికి ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతుంది.
వేర్వేరు టైమ్ జోన్లలో నివసిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తోంది. మీరు ఎవరికైనా బర్త్ డే విషెస్ చెప్పాలన్నా ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఆ సమయానికి షెడ్యూల్ చేస్తే సరిపోతుంది. కొత్త ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూల్ మెసేజ్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. అంటే యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకుని ఉపయోగించడం ప్రారంభించాలి. సోషల్ మీడియా నిపుణుడు లిండ్సే గాంబుల్ ఈ ఫీచర్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. మెసేజ్ షెడ్యూల్ చేయడానికి, ఈ కింది విధానం ఫాలో కావాలి.
- మీరు మెసేజ్ పంపాలనుకునే కాంటాక్ట్ చాట్ ఓపెన్ చేసి మీ మెసేజ్ టైప్ చేయండి.
- బాణంలా కనిపించే సెండ్ బటన్‌ను నొక్కి పట్టుకోండి. మీరు ఒక క్యాలెండర్‌ను చూస్తారు. ఇక్కడ మీరు మెసేజ్ పంపడానికి తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చు.
- తేదీ, సమయాన్ని ఎంచుకున్న తర్వాత షెడ్యూల్ బటన్‌పై నొక్కండి.
ఈ కొత్త ఫీచర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే బిజీగా ఉన్నప్పటికీ షెడ్యూల్ చేస్తే సరిపోతుంది. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలను సమయానికి పంపవచ్చు. అలాగే మీరు ప్రయాణిస్తుంటే, విమానాశ్రయంలో మిమ్మల్ని తీసుకెళ్లమని ఎవరికైనా సందేశం పంపాలనుకుంటే ముందుగానే షెడ్యూల్ మెసేజ్ చేయవచ్చు.
అదేవిధంగా మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రొఫెషనల్ అయితే మీ వినియోగదారులకు సకాలంలో అప్‌డేట్స్ లేదా ప్రమోషన్లను పంపవచ్చు. సందేశాలను 29 రోజుల ముందు వరకు షెడ్యూల్ చేయవచ్చు.