Pappu Chegodi: పిల్లల కోసం పప్పు చేగోడీలు ఇలా సులభంగా ఇంట్లోనే చేసేయండి, రెసిపీ ఇదిగో
Pappu Chegodi: పప్పు చేగోడీలు పేరు చెబితేనే తినాలన్న కోరిక పుడుతుంది. వీటిని మార్కెట్లో కొనితెచ్చే బదులు ఇంట్లోనే చాలా సులువుగా చేసేయొచ్చు.
పప్పు చెగోడీలు ఒకప్పుడు ఫేమస్. వీటిని స్నాక్స్‌గా తినేవారు ఎక్కువమంది. ఆధునిక కాలంలో పిజ్జాలు, బర్గర్లు రావడంతో పప్పు చెగోడీలు తినే వారి సంఖ్య తగ్గిపోయింది. వీటిని ఇంట్లోనే సులువుగా ఎలా చేయాలో తెలుసుకోండి. పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి.
పప్పు చేగోడీలు రెసిపీకి కావలసిన పదార్థాలు
పచ్చిశనగపప్పు - అరకప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
మైదా - అర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
ఫుడ్ కలర్ - చిటికెడు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పప్పు చేగోడీలు రెసిపీ
1. పచ్చిశనగపప్పును నీటిలో వేసి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. తరువాత ఒక పొడి వస్త్రం పై ఆ పప్పును వేసి తడి లేకుండా ఒకసారి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యప్పిండి, మైదా పిండి వేసి బాగా కలపాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు వేయాలి. ఆ నీళ్లు వేడెక్కాక కారం, ఉప్పు వేసి మరిగించాలి.
5. అలాగే ఎరుపు రంగు ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోవాలి. ఇది వేయడం మీకు నచ్చకపోతే అవసరం లేదు.
6. కేవలం రంగు కోసం వీటిని వేయాలి. మార్కెట్లో దొరికే ఎర్రటి చేగోడీలలో ఈ రంగును కలుపుతారు.
7. ఇప్పుడు మరిగించిన నీళ్లలో మైదాపిండి, బియ్యప్పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
8. ఈ మొత్తం మిశ్రమ గట్టిగా ముద్దలాగా అయ్యేదాకా చిన్న మంట మీద కలిపి పైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి.
9. కాసేపటికి మూత తీసి రెండు స్పూన్ల నూనె వేసి ఆ మొత్తం మిశ్రమాన్ని గట్టిగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.
10. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేయాలి.
11. ఇప్పుడు పిండి మిశ్రమంలోంచి చిన్న ముద్దను తీసి చేత్తోనే చేగోడీల్లాగా రోల్ చేసుకుని పక్కన పెట్టాలి.
12. పచ్చిశనగపప్పును పోసి దానిపై ఈ చేగోడీలను ఒత్తాలి. అవి చేగోడీలకు అంటుకుంటాయి.
13. ఈ చేగోడీలను వేడెక్కిన నూనెలో వేసి అన్ని వైపులా వేగేలా వేయించుకోవాలి. అంతే టేస్టీ పప్పు చేగోడీలు రెడీ అయినట్టే.
ఈ పప్పు చేగోడీలు క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లోనే చేసుకున్నవి కాబట్టి హ్యాపీగా తినవచ్చు. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వేయకండి. ఫుడ్ కలర్ వేయకపోవడం వల్ల రంగు ఎరుపుగా రాకుండా కాస్త పసుపు రంగులోకి వస్తుంది. సాయంత్రం పూట స్నాక్స్ గా ఈ పప్పు చేగోడీలు ప్రయత్నించవచ్చు. ఒక్కసారి వీటిని మీరు చేసుకుని చూడండి. ఎంతో సులువుగా అనిపిస్తుంది. క్రంచిగా క్రిస్పీగా ఉండేవి మంచి టైం పాస్ లా అనిపిస్తాయి.