HYDRAA : మళ్లీ రంగంలోకి దిగిన రంగనాథ్.. వారికి వార్నింగ్.. పేదలకు భరోసా!
HYDRAA : కాస్త గ్యాప్ తర్వాత హైడ్రా టీమ్ మళ్లీ రంగంలోకి దిగింది. ఈసారి స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి చెరువులను పరిశీలించారు. ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాత ఇళ్లు, కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని పేదలకు భరోసా ఇచ్చారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మళ్లీ రంగంలోకి దిగారు. హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను పరిశీలించారు. ఈ రెండు సరస్సులను రక్షించడానికి, ఆక్రమణలను తొలగించి ప్రజల పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జూలై 2024 తర్వాత నిర్మించిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.
హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించినవి చట్టబద్ధమైనా, చట్టవిరుద్ధమైనా సరే వాటిని టచ్ చేయబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. పాత నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని స్థానిక రాఘవేంద్ర కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఏవైనా ఆక్రమణలు జరిగితే వాటిని తొలగించాలని, చెరువు గట్లను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వాసవి సరోవర్ డెవలపర్లు నిర్దేశించిన విధంగా 17 మీటర్ల వెడల్పు నాలా నిర్మించకపోతే.. ఆ నిర్మాణాన్ని కొనసాగించవద్దని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. కాముని చెరువు, మైసమ్మ చెరువు మధ్య ఈ నాలా కీలకమైన లింక్‌గా పనిచేస్తుందని వివరించారు. అలాగే ఈ చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోందని రంగనాథ్ చెప్పారు.
రంగనాథ్ అక్కడ ఉండగానే.. చెరువులో ఉన్న గుర్రపుడెక్కను తొలగించడానికి యంత్రాలు వచ్చాయి. జీహెచ్ఎంసీ అధికారులు వాటిని తీసుకొచ్చారు. అయితే.. ఈ ప్రక్రియలో చెరువు కట్టలోని కొంత భాగాన్ని అనుకోకుండా తొలగించారు. దాన్ని కూడా రంగనాథ్ పరిశీలించారు. కట్టను సంరక్షించడానికి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని అధికారులు రంగనాథ్‌కు హామీ ఇచ్చారు.
పుకార్లు నమ్మొద్దు..
హైడ్రా ఏర్పాటుకు కొన్ని ఘటనలు జరిగాయి. వాటికి సంబంధించి అప్పటి కేసుల ప్రకారం చర్యలు ఉంటాయి. వాటితో హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా ఏర్పాటైన తర్వాత జరిగిన ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నాం, బాధ్యులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని.. ఏవి రంగనాథ్ వివరించారు. పుకార్లను నమ్మి పేదలు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే తాము నడుచుకుంటామని వివరించారు.