Hydra: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ముప్పు.. భద్రత పెంచిన ప్రభుత్వం-telangana government has increased security for hydra commissioner av ranganath ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ముప్పు.. భద్రత పెంచిన ప్రభుత్వం

Hydra: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ముప్పు.. భద్రత పెంచిన ప్రభుత్వం

Basani Shiva Kumar HT Telugu
Aug 27, 2024 01:48 PM IST

Hydra: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో.. ముప్పు ఉందని భావించి సెక్యూరిటీని పెంచింది.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఇంటికి భద్రత పెంచారు. మధురానగర్‌ కాలనీలోని రంగనాథ్ ఇంటి దగ్గర భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషనర్‌ రంగనాథ్‌ నివాసం దగ్గర ఔట్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఇటీవలే హైడ్రా పేరుతో రంగనాథ్ అక్రమ కట్టడాల కూల్చివేత మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. రంగనాథ్‌కు ముప్పు పొంచి ఉందని భావించి భద్రతను పెంచారు.

గుండెల్లో గుబులు..

హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా).. ఈ పేరు భూకబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ మహా నగరంలో చెరువులు, కుంటలను చెరబట్టి, నిర్మాణాలు చేసిన ఫలితంగా వర్షం వస్తే రోడ్లపైకి నడుముల్లోతు వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై సామాన్యుల జీవితం అస్తవ్యస్తం అవుతోంది.

రంగనాథ్ సారథ్యంలో..

ఈ పరిస్థితుల నుంచి నగర జీవికి ఊరట కలిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక విభాగాన్నే తయారు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.వి.రంగనాథ్ సారథ్యంలో హైడ్రా నెల రోజుల వ్యవధిలో చేపట్టిన కూల్చివేతలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గడిచిన నెల రోజుల్లో హైడ్రా తొలగించిన కబ్జాలు, రికవరీ చేసిన ప్రభుత్వ స్థలాల గురించి ఓ నివేదికను తయారు చేసింది. హైడ్రా మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 18 చోట్ల ప్రభుత్వ స్థలాల్లోఉన్న కబ్జాలను తొలగించి 43.94 ఎకరాల స్థలాన్ని రికవరీ చేశారు.

18 చోట్ల..

1. ఫిల్మ్ నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ, ప్లాట్ నెం.30 (లోటస్ పాండ్) ప్రాంతంలో నార్నె గోకుల్ ఆక్రమించిన పార్క్ కాంపౌండ్ వాల్ ను తొలగించారు. దీని ద్వారా 6 కుంటల స్థలాన్ని రికవరీ చేశారు. గోకుల్ నార్నె లోటస్ పాండ్ పార్క్ ప్రాంతాన్ని ఆక్రమించారు.

2. హయత్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ రోడ్డులో రోడ్డు వైడెనింగ్ ప్రాంతానికి ఫెన్సింగ్ వేసి ఆక్రమించగా తొలగించారు. దీని ద్వారా 2 కుంటల స్థలాన్ని కాపాడారు.

3. ఎంపీ ఎమ్మెల్యే కాలనీ (విజయ సహకార హౌసింగ్ సొసైటీ ) ప్లాట్ నెం.315 పార్క్ ను ఆక్రమించి నిర్మించిన రెండు ఏసీసీ షీట్ షెడ్ ను, కాంపౌండ్ వాల్ తొలగించారు. దీనిద్వారా 6 కుంటల స్థలాన్ని కాపాడారు.

4. బంజరాహిల్స్ లోని మిథిలా నగర్, రోడ్ నెం.12 లోని పార్క్ ను ఆక్రమించారు. ఇక్కడ ఏసీసీ షీట్ షెడ్ ను, కాంపౌండ్ వాల్ ను తొలగించారు. ఇక్కడ ఏకంగా 1 ఎకరా 4 కుంటల ప్రభుత్వ భూమిని రికవరీ చేశారు.

5. ఫిల్మ్ నగర్లోని బీజేఆర్ నగర్ నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. నాలాపై ఆర్.సి.సి శ్లాబ్ తొలగించి 5 ఎకరాల స్థలాన్ని కాపాడారు.

6. గాజుల రామారంలోని మహదేవ్ పురంలో పార్క్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించి రెండు ఫ్లోర్ల ఆర్.సి.సి బిల్డింగ్ ను కూల్చి వేశారు. ఇక్కడ ఒక అంతస్తు నిర్మాణంలో ఉంది. 1 కుంట స్థలాన్ని రికవరీ చేశారు.

7. గాజులరామారంలోని భూదేవి హిల్స్ లో పరికి చెరువు బఫర్ జోన్ లోని చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన బేస్ మెంట్ ను తొలగించారు. ఆక్రమణ తొలగింపుతో 1.1 ఎకరం స్థలాన్ని కాడారు.

8. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 లోని బాబీలాన్ రెస్టారెంట్ వద్ద ఫుట్ పాత్ ను ఆక్రమించి ఏర్పాటు చేసిన ఎనిమిది స్టీల్ స్ట్రక్చర్స్ ను తొలగించి 5 కుంటల స్థలాన్ని కాపాడారు.

9. అమీర్ పేట నాలాను కబ్జా చేసి నిర్మించిన ఆర్.సి.సి. శ్లాబ్ ను తొలగించి 1 కుంట స్థలాన్ని రికవరీ చేశారు.

10. గాజులరామారం గ్రామంలో సర్వే నెంబరు 329లో చింతల చెరువు స్థలాన్ని కబ్జా చేశారు. ఇక్కడ నిర్మించిన ఆస్ బెస్టాస్ రేకులున్న నిర్మాణాన్ని తొలగించారు. చింతల చెరువు స్థలాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయి రాజు కబ్జా చేసి తాత్కాలిక షెడ్లను నిర్మించగా వాటి కూల్చేశారు. ఈ ఒక్క ప్రాంతంలోనే 54 స్ట్రక్చర్స్ ను తొలగించి 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రికవరీ చేసింది.

11. జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ రోడ్ నెంబర్ 69 లో పార్కును ఆక్రమించి షెడ్లు నిర్మించారు. ఈ కబ్జాదారునికి ఎమ్మెల్యే దానం నాగేందర్ వత్తాసు పలికారు. అయినా, హైడ్రా ఈ నిర్మాణానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ను తొలిగించి 18 కుంటల పార్కు స్థలాన్ని కాపాడారు.

12. రాజేందర్ నగర్ లోని భుమ్రుఖ్ దౌలా చెరువు ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మించిన 45 నిర్మాణాలను తొలగించారు. 40 కాంపౌడ్ వాల్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్లు ఉన్న రెండు బిల్డింగులు, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్లు ఉన్న ఒక బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ తో నిర్మించిన బిల్డింగ్ ఒక దానికి కూల్చేశారు. దీంతో 12 ఎకరాల చెరువు భూమిని కాపాడారు. ఇందులో బహదూర్ పుర ఎంఐంఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం పార్టీకే చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ కు చెందిన భవనాలు ఉన్నాయి.

13. చందానగర్ లోని ఎర్ల చెరువును ఆక్రమించి నిర్మించిన గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఒకదానిని, గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ తో నిర్మించిన 2 బిల్డింగులను కూల్చేశారు. దీంతో 16 కుంటల ప్రభుత్వ స్థలానికి విముక్తి లభించింది.

14. బాచుపల్లి ప్రగతినగర్ లోని ఎర్రకుంట చెవును స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్ల బిల్డింగులు మూడింటిని నేలమట్టం చేసి 29 కుంటల ప్రభుత్వ భూమిని కాపాడారు.

15. బోడుప్పల్ లోని రెవెన్యూ భూమికి సంబంధించి సర్వేనెంబరు 3లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చేపట్టిన ఆర్.సి.సి స్ట్రక్చర్స్ తొలగించి 3 కుంటల భూమిని స్వాధీనం చేసుకున్నారు.

16. ఖానాపూర్ లోని గండిపేట్ లేక్ ను కబ్జా చేసి చేపట్టిన గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్ల బిల్డింగు ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్ తో నిర్మంచిన మరో బిల్డింగ్, పదకొండు తాత్కాలిక షెడ్లు, ఒక కాంపౌండ్ వాల, మొత్తంగా 14 స్ట్రక్చర్లను తొలగించారు. దీనిద్వారా 8.75 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

17. చిలుకూరు పరిధిలోని గండిపేట చెరువు (ఉస్మాన్ సాగర్) స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్ల బిల్డింగులు 2, గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ ఉన్న ఒక బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ తో నిర్మించిన బిల్డొంగులు 3, మూడు కాంపౌండ్ వాల్స్, మొత్తం 17 స్ట్రక్చర్స్ తొలగించడం ద్వారా 6.5 ఎకరాల చెరువు స్థలాన్ని కాపాడారు. గండిపేట చెరువు భూముల కబ్జాలకు సంబంధించి .. కాంగ్రెస్ నాయకుడ, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు సోదరుడు పళ్లం ఆనంద్ కు చెందిన ఓరో స్పోర్ట్స్, కావేరీ సీడ్స్ యజమాని, బీజేపీ అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రొ కబడ్డీ ఓనర్ శ్రీనివాసరావు భార్య అనుపమ పేరున ఉన్న బిల్డింగులను కూల్చేశారు.

18. మాదాపూర్ ప్రాంతంలోని తుమ్మిడికుంట చెరువు భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ భవనంలోని రెండు పెద్ద షెడ్లు, మరో 6 చిన్న షెడ్లను కూల్చేశారు. తద్వారా 4.9 ఎకరాల చెరవు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. మొత్తంగా నెల రోజుల్లో హైడ్రా చేపట్టిన ఆపరేషన్స్ ద్వారా 43.94 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.

Whats_app_banner