Hyderabad: హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక.. ఇకపై ఉక్కుపాదం మోపుతాం అంటూ వార్నింగ్-hyderabad cp kothakota srinivas reddy warns drug users ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad: హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక.. ఇకపై ఉక్కుపాదం మోపుతాం అంటూ వార్నింగ్

Hyderabad: హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక.. ఇకపై ఉక్కుపాదం మోపుతాం అంటూ వార్నింగ్

Basani Shiva Kumar HT Telugu
Aug 26, 2024 02:29 PM IST

Hyderabad: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. తెలంగాణలో డ్రగ్స్ మాటే వినపడొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రగ్స్ వినియోగం, అమ్మకం పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ( (ANI))

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజురోజుకూ పెరుగుతోంది. డ్రగ్స్ కారణంగా యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో రిచ్ పీపుల్ మాత్రమే డ్రగ్స్ వినియోగించేవారు. ఇప్పుడు కల్చర్ మిడిల్ క్లాస్ యూత్‌కు కూడా పాకింది. దీంతో సర్కారు సీరియస్‌గా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ నిర్మూళనకు చర్యలు చేపడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

వినియోగదారులపై ఉక్కుపాదం..

'డ్రగ్స్‌తో పట్టుబడితే వినియోగదారులపై కూడా కేసులు పెడతాం. ఇకపై డ్రగ్స్‌ వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతాం. డ్రింక్స్‌లో డ్రగ్స్‌ కలిపి అలవాటు చేస్తున్నారు. డ్రగ్స్‌ అలవాటు చేసేవారిపై కూడా కేసులు పెడతాం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి' అని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ గురించి ఎవరికి సమాచారం తెలిసినా పోలీసులకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో..

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గట్టిగా పనిచేస్తోంది. డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన పాత నేరస్తులపై నిఘా పెంచింది. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతోంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికలు ముగిసే నాటికి తెలంగాణలో వివిధ చోట్ల రూ.29.31 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు జనవరి 21న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జాంబియాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 41 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు..

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. కొత్తగా డ్రగ్స్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులను నిర్వహించేందుకు రెడీ అయ్యింది. టీఎస్‌న్యాబ్‌ ఈ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఓ కిట్‌ను రూపొందించింది. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని, గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ఎబోన్‌ యూరిన్‌ కప్‌ యంత్రంతో టెస్టులు నిర్వహించనున్నారు. ఈ కిట్‌ను ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో టెస్టులు మొదలుపెట్టారు.