YouTuber Harsha: యూట్యూబర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. హర్ష వెర్షన్ వేరేలా ఉంది!
YouTuber Harsha: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాలో గాల్లోకి డబ్బులు విసిరిన యూట్యూబర్ హర్షపై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫింగ్ ఉల్లంఘనల ఆరోపణలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ వ్యవహారంపై హర్ష కూడా స్పందించారు. తాను ఎంతో మందికి సాయం చేశానని చెప్పాడు.
యూట్యూబర్ హర్షపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు విసిరేస్తూ రోడ్లపై హల్‌చల్ చేసిన హర్ష అనే యువకుడి మీద సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు అయ్యింది. కేపీహెచ్‌బీలో సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. యూట్యూబర్‌పై ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హర్ష డబ్బులను గాల్లోకి విసిరేశాడు. ఆ తర్వాత బైక్‌పై విన్యాసాలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హర్ష డబ్బులు గాల్లోకి విసిరిన తర్వాత.. వాటిని ఏరుకోవడానికి జనాలు ఎగబడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నెల కిందట అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. వాటిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. రోడ్లపై ఇలాంటి పనులేంటని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియోలు వైరల్ కావడం, పోలీసులు కేసులు నమోదు చేయడంపై యూట్యూబర్ హర్ష స్పందించారు. తాను ఎన్నో లక్షల రూపాయలతో ఎంతో మందికి సాయం చేశానని చెప్పారు. తనను నెగిటివ్‌గా చూపించొద్దని కోరారు. కొందరు తనను కావాలనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందన్నారు. తాను చేసిన సాయం గురించి గతంలో ఎప్పుడూ బయటకు చెప్పలేదని.. కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హర్ష మాట్లాడిన ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. హర్ష వాదన పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.