Rajanna Sircilla News : వ్యూస్ కోసం నెమలి కర్రీ అంటూ యూట్యూబర్ వీడియోలు, చీటింగ్ కేసు నమోదు-rajanna sircilla youtuber made video on peacock recipe forest officer police filed case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajanna Sircilla News : వ్యూస్ కోసం నెమలి కర్రీ అంటూ యూట్యూబర్ వీడియోలు, చీటింగ్ కేసు నమోదు

Rajanna Sircilla News : వ్యూస్ కోసం నెమలి కర్రీ అంటూ యూట్యూబర్ వీడియోలు, చీటింగ్ కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Aug 11, 2024 09:40 PM IST

Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యూట్యూబర్ నెమలి కర్రీ అంటూ పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు రంగంలోకి యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. అయితే జుట్టు కోడి కర్రీ వండి వ్యూస్ కోసం నెమలి కర్రీ అని పెట్టానని యూట్యూబర్ చెబుతున్నాడు.

వ్యూస్ కోసం నెమలి కర్రీ అంటూ యూట్యూబర్ వీడియోలు, చీటింగ్ కేసు నమోదు
వ్యూస్ కోసం నెమలి కర్రీ అంటూ యూట్యూబర్ వీడియోలు, చీటింగ్ కేసు నమోదు

Rajanna Sircilla News : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యూట్యూబర్ వ్యూస్ కోసం చిక్కుల్లో పడ్డాడు. నెమలి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తూ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి కేసుల పాలయ్యాడు. చీటింగ్ తో పాటు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే పనిలో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన యూట్యూబర్ కోడం ప్రణయ్ కుమార్ కు వివిధ రకాల వంటలు చేస్తూ యూట్యూబ్ లో పోస్ట్ చేయడం అలవాటు. వ్యూస్ కోసం రెండు రోజుల కితం నెమలి కర్రీ సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ ఓ వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. థంబ్ నెయిల్ జాతీయ పక్షి నెమలి ఫొటో పెట్టారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరలైంది. దీంతో జంతు ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు ఆ వీడియో చూసి ఆందోళనకు గురయ్యారు. జాతీయ పక్షి నెమలిని చంపి కర్రీ చేయడం ఏంటని ప్రశ్నిస్తూ అధికారులకు సమాచారం అందించారు.

యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు

యూట్యూబ్ లో నెమలి కర్రీ అంటూ వీడియో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎఫ్ఆర్ఓఆర్ కల్పనాదేవి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది తంగళ్ళపల్లికి చేరుకొని ప్రణయ్ వంట చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కోడి ఈకలు... ఆయన ఇంట్లో చికెన్ కర్రీని స్వాధీనం చేసుకున్నారు.‌ ఆ కర్రీని టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు చేపడుతామని ఎఫ్ఆర్ఓ కల్పనాదేవి తెలిపారు. చికెన్ కర్రీ వండి నెమలి కర్రీ అంటూ నెమలి పేరును వాడుకోవడం కూడా తప్పేనని ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు అప్పగించారు. ఇదివరకు నడుముకు ఉడుం బలం అంటూ, అడవి పంది కూర అని పలు వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన దృష్ట్యా విచారణ జరుపుతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

వ్యూస్ కోసమే నెమలి పేరు వాడుకున్నా...యూ ట్యూబర్

యూట్యూబర్ కోడం ప్రణయ్ కుమార్ మాత్రం తాను నెమలి కూర వండలేదని స్పష్టం చేశారు. వ్యూస్ కోసం మాత్రమే నెమలి పేరును వాడుకున్నానని తెలిపారు.‌ నెమలి పేరును వాడుకొని జుట్టు కోడి చికెన్ వండానని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని... ఎక్కడికి అంటే అక్కడికి వస్తానని తెలిపారు.‌ జాతీయ పక్షి నెమలి పేరు వాడుకోవడం తప్పేనని ఒప్పుకున్నారు.

పొంతన లేని సమాధానాలు

కలకలం సృష్టించిన నెమలి కర్రీ వీడియో వైరల్ కావడం... స్థానికంగా చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారింది. యూట్యూబర్ రెండు రోజుల క్రితం నెమలి కర్రీ సంప్రదాయ పద్దతిలో ఎలా వండాలి అంటూ కర్రీ వండుతూ ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా రెండు రోజుల అనంతరం ఆదివారం రోజున అటవీ శాఖ అధికారులు యూట్యూబర్ ఇంటికి వెళ్లి చికెన్ కర్రీని స్వాధీనం చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. యూట్యూబర్ చెబుతున్నట్టు జుట్టుకోడి కర్రీ అయితే రెండు రోజుల క్రితం వండిన ఆ కర్రీ ఆదివారం వరకు ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.‌ నెమలి కర్రీ అయిన రెండు రోజుల క్రితంది ఆదివారం వరకు ఉంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.‌ ఏది నిజం.. ఏది అబద్దమో స్పష్టంగా తెలియక పోయినప్పటికీ ఇది వరకు వన్యప్రాణుల కర్రీ అంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన దృష్ట్యా అతనిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతినిధులు కోరుతున్నారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం