People Empowerment Platform : పీపుల్ ఎంపవర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ పేరుతో గూగుల్‌తో పని చేయనున్న హిమాచల్ ప్రభుత్వం
People Empowerment Platform : హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టడాన్ని పరిగణించాలని గూగుల్‌ను కోరారు. ఏఐని ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించాలని అన్నారు.
వ్యవసాయం, విపత్తుల సన్నద్ధతలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం అధునాతన సాంకేతికతకు ఉందని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు అన్నారు. కచ్చితమైన వాతావరణ అంచనాతో స్థానిక పరిపాలనల నుండి మెరుగైన ప్రణాళికలు వేచయవచ్చని తెలిపారు. దీనిద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పారు.
హిమాచల్ ప్రభుత్వం కార్మిక, ఉపాధి శాఖ ద్వారా గూగుల్ సహకారంతో 'పీపుల్ ఎంపవర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్'ను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని ముఖ్యమంత్రి ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. 'ఈ ప్లాట్‌ఫారమ్ పౌరులను ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు వంటి నైపుణ్యం కలిగిన సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానిస్తుంది. ఇది అసంఘటిత రంగంలో రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు సాయపడుతుంది.' అని వెల్లడించారు.
గూగుల్ ఇండియా హెడ్ ఆశిష్ వాటల్ హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజా సేవలను మార్చే లక్ష్యంతో ఏఐ ఆధారిత కార్యక్రమాలపై సహకారాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రికి పిలుపునిచ్చారు. వ్యవసాయంలో డిజిటల్, ఆరోగ్యం, విద్య, ప్రజా ఫిర్యాదుల పరిష్కారాలలో అధునాతన సాంకేతికతను ఉపయోగించడంపై చర్చించారు. సత్వర సేవలను అందించడానికి, రాష్ట్రంలోని పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని ఆశిష్ చెప్పారు.
ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి సేవా సంకల్ప్ హెల్ప్‌లైన్ 1100ని AIతో అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం సుఖ్‌విందర్ సింగ్ తెలిపారు. వినియోగదారుల సంతృప్తి చెందేలా వేగవంతమైన పరిష్కారాలను అందించడం దీని లక్ష్యం అని ఆయన అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు. విద్యా రంగంలో అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి, బోధనా పద్ధతులను ఆధునీకరించడానికి రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనా మాడ్యూళ్లను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
టాపిక్