Spicy Pickle: వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం కలిపి స్పైసీ ఊరగాయ ఇలా పెట్టుకుంటే రుచి అదిరిపోతుంది
Spicy Pickle: తెలుగు వారికి ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ మేము కొత్త రుచిని అందించే వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం కలిపి ఊరగాయ పెట్టి చూడండి. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
తెలుగువారికి ఊరగాయలు అంటే ఎంతో ఇష్టం. ప్రతి ఇంట్లో నిల్వ పచ్చళ్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వేడి వేడి అన్నంలో నిల్వ పచ్చళ్లు తినే వారి సంఖ్య ఎక్కువే. శీతాకాలంలో అనేక రకాల ఊరగాయలను తయారుచేస్తారు. ఈ చట్నీలు అన్నంతో పాటూ, దోశె, ఇడ్లీతో కూడా తినవచ్చు. మార్కెట్ లో అన్ని రకాల ఊరగాయలు సులువుగా దొరుకుతాయి. కానీ ఇంట్లో తయారుచేసుకునే తాజా ఊరగాయల రుచే వేరు. ఇంట్లో తయారుచేసే స్పైసీ ఊరగాయలు రుచిని రెట్టింపు చేస్తాయి. చలికాలంలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోండి. మీరు ఇంతకు ముందు ఈ రకమైన ఊరగాయను తిని ఉండరు. ఇది చపాతీలతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని రెసిపీని ఇక్కడ ఇచ్చాము.
వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం స్పైసీ చట్నీకి కావాల్సిన పదార్ధాలు
పచ్చిమిర్చి - పదిహేను
అల్లం - 50 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 20
ఉప్పు - రుచికి సరిపడా
వెనిగర్ - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
మెంతులు - ఒక స్పూను
వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం స్పైసీ చట్నీ రెసిపీ
- ఈ చట్నీ స్పైసీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడానికి స్టవ్ మీద కళాయి పెట్టాలి.
- అందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి వేయించాలి.
- అవి చల్లారాక మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.
- ఇప్పుడు పచ్చిమిర్చిని బాగా కడిగి ఆ తర్వాత కట్ చేసి మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అల్లం శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక పాత్రలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.
- అందులో ఉప్పు, వెనిగర్ వేసి కలపాలి.
- ముందుగా రుబ్బి పెట్టుకున్న పొడిని కూడా అందులో వేసి కలుపుకోవాలి.
- పసుపు, కారం కూడా వేసి ఈ మొత్తాన్ని కలపాలి.
- దీన్ని రెండు రోజుల పాటూ బాగా ఊరనివ్వాలి. ఆ తరువాత నుంచి వేడి వేడి అన్నంలో ఈ చట్నీని వేసి కలుపుకుని తింటే ఆ రుచే వేరు.
ఈ ఊరగాయలో ముఖ్యంగా వాడినవి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. వీటిలో ఉండే పోషకాలు ఎక్కువ. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి అల్లం, వెల్లుల్లికి ఉంది. అల్లం దగ్గును తగ్గిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు రాకుండా కూడా అడ్డుకోవచ్చు. కారంతో పోలిస్తే పచ్చి మిర్చిలోనే ఔషధ గుణాలు ఎక్కువ. కారం వాడేందుకు బదులుగా పచ్చిమిర్చిని వాడమని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు.