PM Modi: ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపు మెసేజ్; అప్రమత్తమైన పోలీసులు
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం ముంబై పోలీసులకు వాట్సాప్ ద్వారా అందింది. ప్రధాని మోదీని హత్య చేయడం లక్ష్యంగా బాంబు పేలుళ్లకు ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు పాల్పడనున్నారని ఆ సందేశంలో పేర్కొన్నారు. దాంతో పోలీసులు అప్రమత్తమై, దర్యాప్తు ప్రారంభించారు.
PM Modi gets death threat: ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం వాట్సాప్ ద్వారా ముంబై పోలీసులకు శనివారం అందింది. ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ కు పంపిన ఆ మెసేజ్ లో మోదీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఐఎస్ ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని చంపేస్తామని ముంబై పోలీసులకు రెండు వారాల క్రితం కూడా ఒక మెసేజ్ వచ్చింది.
రాజస్తాన్ లోని అజ్మీర్ నుంచి..
ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరిస్తూ సందేశం వచ్చిన నంబర్ రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్నట్లు గుర్తించామని, దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ (narendra modi) ని హత్య చేస్తామని బెదిరిస్తూ సందేశం పంపిన వ్యక్తి మానసిక రోగి అయి ఉండవచ్చని, లేదా మద్యం మత్తులో ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
గతంలో కూడా..
పీఎం మోదీ ని హత్య చేస్తామని గతంలో ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. గతవారం ముంబై పోలీసులకు ఒక అజ్ఞాత కాల్ వచ్చింది. ప్రధాని మోదీని చంపేయనున్నట్లు ఆ కాల్ చేసిన మహిళ హెచ్చరించింది. అనంతరం, ఆ 34 ఏళ్ల మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆమె నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. గత బుధవారం ఉదయం 9.13 గంటలకు ముంబై మెయిన్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ మహిళ ఫోన్ చేసి పీఎం మోదీని చంపేందుకు కుట్ర పన్నారని, అందుకు ఆయుధం సిద్ధంగా ఉందని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
టాపిక్