APSRTC Allowance : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, నైటౌట్ అలవెన్సులు ప్రకటన
APSRTC Allowance : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేసింది. నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు అదనపు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
APSRTC Allowance : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేసింది. రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్స్ ఇచ్చేలా జీవో విడుదల చేసింది. వేతనంతో కలిపి ఉద్యోగులకు నైటౌట్ అలవెన్స్ ఇవ్వనుంది. దీంతో ఉద్యోగులకు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు అదనంగా అందే వీలు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, నైటౌట్ అలవెన్స్ చెల్లింపులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నైటౌట్ అలవెన్స్ ప్రకటించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
2029 నాటికి 12717 ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీఎస్‌ఆర్టీసీ విద్యుత్ బస్సుల దిశగా అడుగులు వేస్తుంది. రానున్న ఐదేళ్లలో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్లాన్ రెడీ చేసింది. 2029 నాటికి ఏపీఎస్ఆర్టీసీలోని 12,717 బస్సులు ఈవీ ఆధారితంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టీసీ సొంతంగా 10,155 బస్సులు, అద్దె ప్రాతిపదికన 2,562 బస్సులు ఉన్నాయి. మోటారు వెహికల్ చట్టం ప్రకారం, 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో 15 ఏళ్లు పూర్తి చేసుకునే 2,537 బస్సులను తొలగించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది.
11 నగరాలకు 750 విద్యుత్ బస్సులు
2029 నాటికి అదనంగా 1,285 అద్దె బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1,698 కొత్త బస్సులు, 2,726 విద్యుత్ బస్సులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ.35 లక్షల మేర సబ్సిడీ లభిస్తుంది. సాధారణంగా ఒక్కో విద్యుత్ బస్సు కొనుగోలుకు రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ పథకం ద్వారా రాష్ట్రంలోని 11 నగరాలకు 750 విద్యుత్ బస్సులను అద్దె ప్రాతిపదికన మంజూరు చేసింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, నెల్లూరు నగరాలకు 100 బస్సులు చొప్పున, అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతికి 50 బస్సులు చొప్పున మంజూరయ్యాయి. తిరుపతికి 300 విద్యుత్ బస్సులు మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
సంబంధిత కథనం