వెల్లుల్లి పొట్టు ఎలా తీయాలి? ఈ పద్ధతిలో సెకెండ్లలో తీసేయొచ్చు.. ఈ టిప్స్ మీరూ తెలుసుకోండి
వెల్లుల్లి పొట్టు తీయడం ఒకింత సమస్యగా అనిపిస్తుంది. పప్పు వంటి వంటల్లో వేసుకోవడానికి లేదా అల్లం వెల్లుల్లి పేస్టు చేసుకునేటప్పుడు పెద్ద మొత్తంలో అవసరమవుతాయి. చాలా సమయం తీసుకుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల సెకెండ్లలో తీసేయొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
మన రోజువారీ వంటల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తాం. నెలకోసారి అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకోవడం, లేదా నేరుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల రెసిపీల్లో వాడుకోవడం మనకు తెలుసు. అయితే వెల్లుల్లి కఠినమైన పొరతో కప్పబడి ఉంటుంది. వాటిని తొలగించడం సవాలుగా ఉంటుంది. సూపర్ మార్కెట్లలో పొట్టు తీసిన వెల్లుల్లి కూడా లభిస్తుంది. కానీ అది తాజాగా ఉండకపోవచ్చు. అందుకే మనం ఇంట్లోనే తీసి పెట్టుకోవడం ఉత్తమం. సాంప్రదాయ పద్ధతులలో అయితే గోటితో పొర ఒలుస్తాం. అయితే ఇందుకు సమయం తీసుకుంటుంది. వేలు నొప్పి పెడుతుంది. కానీ కొన్ని చిట్కాలతో సులువుగా తీసేయొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
మైక్రోవేవ్ పద్ధతి: త్వరిత, సులభమైన పరిష్కారం
వెల్లుల్లి రెబ్బల పొట్టును తీయడానికి ఇది సులభమైన పద్ధతి. ముందుగా వెల్లుల్లి గడ్డల నుంచి రెబ్బలను వేరు చేయండి. తరువాత మీరు వాటిని మైక్రోవేవ్-సేఫ్ బౌల్‌లో ఉంచండి. 10-15 సెకన్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేయండి.
ఇప్పుడు మైక్రోవేవ్ నుండి వచ్చే వేడి వెల్లుల్లి పొరలు వదులుయ్యేలా చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను మైక్రోవేవ్ చేయడం వల్ల అవి వేడెక్కుతాయి. దీని వలన పొర విస్తరిస్తుంది. రెబ్బ నుంచి సులువుగా విడిపోతుంది. ఈ సులువైన టిప్ పాటించడం వల్ల సమయం ఆదా అవుతుంది. శ్రమ తగ్గుతుంది.
నీటిలో నానబెట్టడం
వెల్లుల్లి రెబ్బలను ఒక గిన్నె నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టడం మరొక సులువైన పద్ధతి. ఇది వెల్లుల్లి పొరను మృదువుగా చేస్తుంది, అప్పుడు దాని పొర త్వరగా విడిపోతుంది.తరువాత ఆరబెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. అయితే పేస్టు చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల తగినంతగా ఆరబెట్టాల్సిన అవసరం ఉంటుంది.
సూదిని ఉపయోగించడం
వెల్లుల్లి అడుగు భాగంలో సూదిని ఉపయోగించి పొట్టును వేరుచేయొచ్చు. పైన చెప్పిన టిప్స్‌తో పోలిస్తే అంత మెరుగైన పద్ధతి కాకపోవచ్చు. అయితే గోటితో తీయడం కంటే ఇది మేలైన పద్ధతి.
ప్రెస్ చేయడం
వెల్లుల్లి గడ్డ నుంచి రెబ్బలను వేరుచేసిన తరువాత వాటిని గట్టిగా నలపడం వల్ల వాటి పొర వదులవుతుంది. అప్పుడు పొరను తీసేయడం సులువవుతుంది.
గార్లిక్ ప్రెస్, పీలింగ్ టూల్స్
మార్కెట్లో గార్లిక్ ప్రెస్, పీలింగ్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఐకియా వంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ లభిస్తుంది. ధర కూడా నాణ్యతను బట్టి రూ. 200 నుంచి రూ. 500 మధ్య ఉంటుంది. ఒకసారి మీరు కొనుగోలు చేసి చూడండి. రెబ్బల పొట్టు తీసేందుకు, అలాగే వెల్లుల్లి రెబ్బను క్రష్ చేసేందుకు వీటిని వాడుతారు. రివ్యూ చూసి ఆర్డర్ చేయడం మంచిది.
సంబంధిత కథనం