Bapatla Crime: బాపట్ల జిల్లాలో ఘోరం.. స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం.. తనపైనే దాడి జరిగిందని ఉల్టా ఫిర్యాదు..
Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహానికి కళంకం తెచ్చేలా ఓ యువకుడు స్నేహితుడు భార్యపై అత్యాచార యత్నం చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడు పడి ఉండగా అతని ఇంట్లోనే మిత్రుడి భార్యపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Bapatla Crime: బాపట్ల జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి భార్యపైనే కన్నేసి, ఆమెను అత్యాచారం చేసేందుకు భర్త స్నేహితుడు యత్నించాడు. స్నేహితుడు మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరాగా తీసుకుని, ఆయన భార్యపై అఘాయిత్యానికి పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. బాధితురాలుఅతని చెర నుంచి బయటపడి, కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. నిందితుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అయితే తనను కొట్టారని నిందితుడు ఉల్టా ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితురాలి తల్లితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బాజీ, బాధితురాలి భర్త ఎప్పటి నుంచో కలిసి మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు. అలాగే స్నేహితులిద్దరూ ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లేంతా స్నేహితులయ్యారు. దీంతో బాధితురాలి భర్త, నిందితుడు బాజీ ఇంటికి, నిందితుడు బాజీ, బాధితురాలి ఇంటికి తరచూ వెళ్లే వారు. ఆదివారం వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం ఎక్కువ తాగడంతో మత్తులో ఉన్న బాధితురాలి భర్త నడవలేని పరిస్థితిలో ఉన్నాడు.
మత్తులో ఉన్న తన స్నేహితుడిని భుజాన వేసుకుని బాజీ ఆయన ఇంటికి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న భర్తను బెడ్‌రూంలోకి తీసుకెళ్లింది. అక్కడ మంచంపై పడుకోబెట్టిన తర్వాత బయటకు వచ్చి ఇంటి తలుపులు వేసేందుకు వరండాలోకి వెళ్లింది. అయితే నిందితుడు బాజీ అక్కడున్న సోఫాలో నిద్ర పోతూ ఉన్నాడు. దీన్ని చూసిన ఆమె మరొక బెడ్‌రూమ్‌లోకి వెళ్లి, తలుపు వేసుకుని పడుకుంది. కాసేపటికే ఆమె నిద్రలోకి జారుకుంది.
అర్థరాత్రి సమయంలో బాజీ లేచి, ఆమె పడుకున్న బెడ్‌రూం తలుపు కొట్టాడు. దీంతో నిద్ర నుంచి లేచి, ఏం కావాలని అడిగింది. తాగేందుకు నీరు కావాలని బాజీ అడిగాడు. బాధితురాలు తాను నిద్రిస్తున్న గది తలుపు తీసి, తాగునీరు తెచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఇదే అదునుగా భావించిన నిందితుడు స్నేహితుడి భార్యపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు అతని నుంచి విడిపించుకుని ఇంటి బయటకు పరిగెత్తింది.
బాధితురాలు భయంతో బిగ్గరగా కేకలు వేయడంతో ఆమె అత్తతో పాటు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు బాధితురాలు కొల్లూరు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిపై అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మాత్రం ఉల్టాగా తనపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారని, కొట్టారని బాధిత కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితురాలి తల్లితో పాటు ఐదుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండువైపు ఫిర్యాదులు వచ్చాయని, ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ ఏడు కొండలు తెలిపారు. ఈ కేసులపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)