AP TG Rain ALERT : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలోని ఈ జిల్లాలకు అతిభారీ వర్ష సూచన..! హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఈ మేరకు వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రభావంతో ఈ రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని వివరించింది. ఈ ప్రభావంతో ఈ 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ జిల్లాలకు హెచ్చరికలు..!
ఈ ప్రభావంతో రానున్న ఈ రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఏపీలో ఇవాళ(డిసెంబర్ 18, 2024) విజయనగరం,విశాఖ,అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం,పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా,నెల్లూరు,వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటనలో సూచించారు.
తెలంగాణకు వర్ష సూచన:
ఇక తెలంగాణలో చూస్తే డిసెంబర్ 19వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది. డిసెంబర్ 20వ తేదీ కూడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. డిసెంబర్ 21వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
హైదరాబాద్ లో చూస్తే ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమై ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఈశాన్య దిశలో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.