Gavaskar on Ashwin: సిరీస్ మధ్యలో రిటైరవడం ఏంటి.. ఇది సరి కాదు.. అప్పుడు ధోనీ అలాగే చేశాడు: అశ్విన్ నిర్ణయంపై గవాస్కర్
Gavaskar on Ashwin: అశ్విన్ రిటైర్మెంట్ సమయాన్ని ప్రశ్నించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. బోర్డర్ గవాస్కర్ సిరీస్ మధ్యలో రిటైరవడం సరి కాదని, పదేళ్ల కిందట ధోనీ కూడా ఇలాగే చేశాడని అతడు అనడం గమనార్హం.
Gavaskar on Ashwin: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత అతడు రిటైరవ్వాల్సిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ తీసుకున్న నిర్ణయం వల్ల చివరి రెండు టెస్టులకు టీమిండియాకు ఓ ప్లేయర్ తగ్గిపోతాడని అన్నాడు.
అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన గవాస్కర్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన వెంటనే రవిచంద్రన్ అశ్విన్ తాను రిటైరవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వెంటనే అతడు ఇండియాకు కూడా తిరిగి రానున్నాడు. అతని ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందిస్తూ.. అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
"ఈ సిరీస్ తర్వాత నేను ఇండియన్ టీమ్ ఎంపికకు అందుబాటులో ఉండను అని అతడు చెప్పాల్సింది. ఇది 2014-15 సిరీస్ సందర్భంగా మూడో టెస్టు తర్వాత ధోనీ కూడా ఇలాగే రిటైరయ్యాడు. దీనివల్ల ఓ ప్లేయర్ తక్కువవుతాడు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
చివరి టెస్టుకు ఉండాల్సింది
ఎవరైనా గాయపడితే అందుబాటులో ఉంటారనే సెలెక్టర్లు చాలా మంది ప్లేయర్స్ ను ఎంపిక చేశారని ఈ సందర్భంగా గవాస్కర్ తెలిపాడు. అంతేకాదు సిడ్నీలో జరగబోయే చివరి టెస్టుకు అశ్విన్ ఉంటే బాగుండేదని, అది స్పిన్ కు అనుకూలించే పిచ్ అని కూడా సన్నీ చెప్పాడు.
"సిడ్నీలో స్పిన్నర్లకు చాలా మద్దతు లభిస్తుంది. అందువల్ల ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగేదేమో. చెప్పలేం. అతడు కచ్చితంగా ఉండేవాడు. మెల్‌బోర్న్ లో పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. సాధారణంగా సిరీస్ ముగిసిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. సిరీస్ మధ్యలో మామూలుగా ఉండవు" అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
మరి అశ్విన్ స్థానంలో ఎవరు వస్తారన్న ప్రశ్నకు గవాస్కర్ స్పందిస్తూ.. వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఉంటుందని చెప్పాడు. అశ్విన్ రేపే ఇండియాకు బయలుదేరుతున్నాడని రోహిత్ చెప్పాడు కాబట్టి.. ఇక అతని అంతర్జాతీయ క్రికెట్ ముగిసిపోయిందని, అతడో మంచి క్రికెటర్ అని సన్నీ అన్నాడు.
అశ్విన్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ మాటల వల్ల తెలుస్తోంది. తాను పెర్త్ లో అడుగుపెట్టినప్పుడే తనకీ విషయం తెలుసని అన్నాడు. సిరీస్ తొలి టెస్టులో అశ్విన్ కు బదులు సుందర్ ను తీసుకున్నారు. ఆ మ్యాచ్ లో టీమ్ గెలిచినా రెండో టెస్టుకు మళ్లీ అశ్విన్ ను తీసుకొచ్చారు. పింక్ బాల్ టెస్టు వరకు ఆగాలని తాను అశ్విన్ ను కోరినట్లు కూడా రోహిత్ తెలిపాడు. కానీ ఆ మ్యాచ్ లో కేవలం ఒకే వికెట్ తీసి నిరాశపరిచాడు.