Listing gains: ఈ ఐపీఓ అలాట్ అయినవారికి పండుగే; స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలి రోజే 88% అప్
Listing gains: ఇటీవల ఐపీఓ తో ప్రైమరీ మార్కెట్లోకి వచ్చిన మొబిక్విక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొదటి రోజే ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించింది. మొబిక్విక్ షేరు బుధవారం ఇష్యూ ధర రూ .279 తో పోలిస్తే 58.5% పెరిగి రూ .442.25 వద్ద ప్రారంభమైంది. ఈ ఐపీఓకు 119 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది.
Mobikwik share price: డిసెంబర్ 18, బుధవారం మొబిక్విక్ షేరు ధర బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్ ను అధిగమించింది. లిస్టింగ్ ధర విషయంలో గ్రే మార్కెట్ అంచనాలను కూడా అధిగమించింది. ఇష్యూ ధర రూ.279తో పోలిస్తే మొబిక్విక్ షేరు ధర 58.5 శాతం ప్రీమియంతో రూ.442.25 వద్ద ప్రారంభమైంది. అనంతరం, ఇష్యూ ధరతో పోలిస్తే 88 శాతం పెరిగి రూ.524.90 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో ఈ షేరు రూ.517.45 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఉదయం గ్రే మార్కెట్లో ఈ షేరు 57 శాతం ప్రీమియం (GMP) తో ట్రేడవుతోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కంపెనీ వృద్ధి అవకాశాలు, ఆకర్షణీయమైన ఐపీఓ వాల్యుయేషన్, మార్కెట్ వాటా దృష్ట్యా చాలా మంది నిపుణులు మొబిక్విక్ ఐపీఓకు సబ్ స్క్రైబ్ రేటింగ్ ఇచ్చారు.
ఇన్వెస్ట్ చేయాలా లేక లాభాలు బుక్ చేసుకోవాలా?
ఈ మొబిక్విక్ ఐపీఓ (IPO) లో షేర్స్ అలాట్ అయిన ఇన్వెస్టర్లు ఇప్పుడు లిస్టింగ్ గెయిన్స్ కోసం షేర్స్ ను అమ్మేయాలా? లేక భవిష్యత్తులో మరింత పెరగే అవకాశాలున్నాయా? అని తర్జనభర్జన పడుుతన్నారు. అయితే, తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కంపెనీ వృద్ధికి పుష్కలమైన అవకాశం ఉందని భావిస్తున్నందున దీర్ఘకాలికంగా మొబిక్విక్ (Mobikwik) స్టాక్ పై నిపుణులు బుల్లిష్ గా కనిపిస్తున్నారు. "పోటీ ఉంది, కానీ భారతదేశం యొక్క భారీ జనాభా మొబిక్విక్ వేగవంతమైన వృద్ధికి పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది. ఈ స్టాక్ దీర్ఘకాలికంగా కొనుగోలు చేసేదే'' అని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ అన్నారు. ‘‘ఇది కొత్త తరం ఫిన్ టెక్ కంపెనీల శకం. వాల్యుయేషన్ విషయానికొస్తే, ఇష్యూ తర్వాత, స్టాక్ దాని పుస్తక విలువకు 9.81 రెట్లు ఎక్కువగా ట్రేడవుతోంది. ఇండియాలో అత్యధిక యూజర్ల పరంగా ఈ కంపెనీ నాలుగో స్థానంలో ఉంది. మే 2024 నాటికి, ఇది 23 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ తన ప్రధాన వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది" అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరింత పైకి..
స్టోక్స్ బాక్స్ రీసెర్చ్ అనలిస్ట్ అభిషేక్ పాండ్యా కూడా మొబిక్విక్ స్టాక్ గురించి వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 135.41 మిలియన్ యూజర్లు ఉన్న రిజిస్టర్డ్ వాలెట్ యూజర్లలో మొబిక్విక్ మూడో స్థానంలో ఉందని పాండ్యా గుర్తు చేశారు. ‘‘డిజిటల్ చెల్లింపులు వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీల విలువ 30 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం మధ్య 19 శాతం సీఏజీఆర్ పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.3,458.29 మిలియన్లుగా ఉందని, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు 28 శాతం సీఏజీఆర్ ఉంది’’ అని పాండ్యా తెలిపారు.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకరేజీ సంస్థలవి, హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.