Domestic air passengers: ఆన్ టైమ్‌లో ఎయిర్ ఏషియా ఫస్ట్.. మార్కెట్ వాటాలో ఇండిగో
Domestic air passengers: ఆగస్టు మాసంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
Domestic air passengers: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఆగస్టులో పెరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రనష్టాలు చవిచూసిన విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోంది. ఆగస్టులో 4 శాతం మేర ప్రయాణికులు పెరిగారు. జూలైలో 97.06 లక్షల ప్రయాణికులు ఉండగా, ఆగస్టులో ఈ సంఖ్య 1.01 కోట్లకు పెరిగింది.
‘దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించిన వారి సంఖ్య జనవరి నుంచి ఆగస్టు మధ్య 460.45 లక్షలు. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 67.38 శాతం వృద్ధి కనబరిచింది. నెలవారీ వృద్ధి 50.96 శాతంగా నమోదైంది..’ అని శుక్రవారం డీజీసీఏ తెలిపింది.
కాగా మార్కెట్ వాటాల్లో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. ఇండిగో ఎయిర్ లైన్ 57.7 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. తదుపరి విస్తారా 9.7 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.
అంతకుముందు నెలతో పోలిస్తే ఈ రెండు విమానయాన సంస్థల మార్కెట్ షేరు స్వల్పంగా తగ్గింది. జూలై నెలలో ఇండిగో మార్కెట్ వాటా 58.8 శాతం, విస్తారా వాటా 10.4 శాతంగా ఉంది. ఇక ఇటీవలే ఆరంగేట్రం చేసిన ఆకాశ ఎయిర్ లైన్ 0.2 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.
గో ఫస్ట్ మార్కెట్ షేర్ 8.2 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది. ఎయిర్ ఇండియా కూడా 8.4 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. ఎయిర్ ఏషియా మార్కెట్ వాటా కూడా 4.6 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. స్పైస్ జెట్ మాత్రం 8 శాతం మార్కెట్ వాటా నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఇక అలయన్స్ ఎయిర్ మార్కెట్ వాటా 1.2 శాతంగా కొనసాగుతోంది.
ఆగస్టు నెలలో ఆన్ టైమ్ పర్‌ఫామెన్స్ (ఓటీపీ)లో అగ్రస్థానంలో ఎయిర్ ఏషియా నిలిచింది. ఇక స్పైస్ జెట్ అత్యధిక పాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ సాధించింది.
ఆన్ టైమ్ పర్ఫామెన్స్ కేవలం నాలుగు మెట్రో ఎయిర్ పోర్టులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టుల నుంచి రాకపోకలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
ఆగస్టులో 93.3 శాతంతో ఎయిర్ ఏషియా ఓటీపీ ఫ్యాక్టర్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తదుపరి విస్తారా 91.4 శాతం, ఇండిగో 85.5 శాతం, స్పైస్ జెట్ 79.1 శాతం, గో ఫస్ట్ 74.9 శాతం, అలయన్స్ ఎయిర్ 72.1 శాతంతో తదుపరి స్థానాల్లో నిలిచాయి.
పాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (సీట్ ఆక్యుపెన్సీ) విషయంలో స్పైస్ జెట్ టాప్‌లో నిలిచింది. 84.6 శాతం సీట్ ఆక్యుపెన్సీ దక్కించుకుంది. తదుపరి 84.2 శాతంతో విస్తారా, 81.6 శాతంతో గో ఫస్ట్ నిలిచాయి. ఇండిగో సీట్ ఆక్యుపెన్సీ 78.3 శాతంగా ఉంది. ఎయిర్ ఇండియా, 73.6 శాతం, ఎయిర్ ఏషియా 74.9 శాతం సీట్ ఆక్యుపెన్సీ సాధించాయి.