Air India: ఎయిర్ ఇండియా జోరు.. 24 కొత్త విమానాల టేకాఫ్
Air India: ఆగస్టు 20 నుంచి ఎయిర్ ఇండియా అదనంగా 24 దేశీయ విమాన సర్వీసులు నడపనుంది.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా దేశీయ సేవలందించేందుకు 24 అదనపు విమానాలను ఈ ఆగస్టు 20వ తేదీ నుంచి నడపనుంది. ఈమేరకు ఎయిర్ ఇండియా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘ఈ 24 విమానాల్లో కొన్ని ఢిల్లీ నుంచి ముంబైకి, ఢిల్లీ నుంచి ముంబైకి, ఢిల్లీ నుంచి బెంగళూరుకు, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు, అలాగే ముంబై నుంచి చెన్నైకి, ముంబై నుంచి హైదరాబాద్‌కు సేవలు అందిస్తాయి. అలాగే ముంబై-బెంగళూరు మార్గం, అహ్మదాబాద్-పూణే మార్గంలో కూడా కొత్తగా సేవలు అందిస్తాయి..’ అని ఎయిర్ ఇండియా ప్రకటన తెలిపింది.
ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ గడిచిన ఆరు నెలలుగా తమ భాగస్వాములందరితో మాట్లాడుతున్నామని, వారందరూ తిరిగి ఎయిర్ ఇండియాకు సేవలు అందించేందుకు అంగీకరించారని తెలిపారు.
ఎయిర్ ఇండియా చిన్న విమానాల సంఖ్య 70గా ఉంది. ఇందులో 54 ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. మరో 16 విమానాలు 2023 కల్లా తిరిగి సేవలు అందించడం ప్రారంభిస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
టాటా సంస్థ చేతిలోకి వెళ్లిన తరువాత ఎయిర్ ఇండియాలో కొత్తగా విమానాలు చేరడం ఇదే తొలిసారి.