UPI transaction limit: యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు: లైట్ వాలెట్, 123పేకు ఆర్బీఐ కొత్త పరిమితులు
UPI transaction limit: యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. యూపీఐ లైట్ వాలెట్ ట్రాన్సాక్షన్ లిమిట్ ను కూడా పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుపిఐ లైట్ వాలెట్, యూపీఐ 123పే కోసం కొత్త లావాదేవీ పరిమితులను ప్రకటించింది.
UPI transaction limit: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూపీఐ లైట్ వాలెట్, యూపీఐ 123పే కోసం కొత్త లావాదేవీ పరిమితులను ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ద్రవ్యపరపతి విధాన ప్రకటనలో ఈ వివరాలను పంచుకున్నారు. యాక్సెసబిలిటీని పెంచడం ద్వారా భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ది గణనీయ పాత్ర అన్నారు.
పెరిగిన యూపీఐ లావాదేవీ పరిమితులు
1. యూపీఐ 123పే కోసం ప్రతి లావాదేవీ పరిమితి రూ.5,000 నుంచి రూ.10,000కు పెరుగుతుంది.
2. యూపీఐ లైట్ వాలెట్ పరిమితి రూ.2,000 నుంచి రూ.5,000కు, ప్రతి లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కు పెరుగుతుంది.
యూపీఐ (UPI)లావాదేవీలను ప్రోత్సహించడానికి, వినియోగదారులందరికీ దీనిని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ మార్పులు చేశామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) వ్యవస్థ ద్వారా డబ్బు బదిలీని పూర్తి చేయడానికి ముందు ఖాతాదారుడి పేరును ధృవీకరించడానికి వీలు కల్పించే కొత్త ఫీచర్ ను కూడా ఆయన ప్రతిపాదించారు. దీని ద్వారా నిధులు సరైన గ్రహీతకు చేరుతాయని, చెల్లింపు ప్రక్రియలో దోషాలు, మోసాలు తగ్గుతాయని ఆర్బీఐ (RBI) గవర్నర్ తెలిపారు.
యూపీఐ లైట్ వాలెట్ ఎలా పని చేస్తుంది?
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ లోని యూపీఐ లైట్ వాలెట్ తో యూపీఐ లావాదేవీలు సులభతరం అవుతాయి. యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు తమ యూపీఐ పిన్ ను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా, ఇప్పటివరకు రూ .500 వరకు చెల్లింపులు చేయడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఆ పరిమితి రూ .1,000 వరకు పెరుగుతుంది. యూపీఐ లైట్ ను ఉపయోగించడానికి, వినియోగదారులు మొదట వారి యూపీఐ లైట్ వాలెట్ లో తమ బ్యాంక్ ఖాతా లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా మనీ ని యాడ్ చేయాలి. గతంలో గరిష్టంగా రూ.2,000 వరకు ఇందులో యాడ్ చేయడానికి వీలు ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5,000 లకు పెరుగుతుంది. ఇది వినియోగదారులకు వారి లావాదేవీలను మరింత సులభంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ 123పే
యూపీఐ 123పే ఫీచర్ ఫోన్ చెల్లింపులను సులభతరం చేయడానికి నాలుగు వేర్వేరు పద్ధతులను అందిస్తుంది. అవి
1. ప్రీ-డిఫైన్డ్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) నంబర్
2. మిస్డ్ కాల్ పేమెంట్ పద్ధతి
3. OEM ఆధారిత చెల్లింపు వ్యవస్థలు
4. సౌండ్ బేస్డ్ పేమెంట్ టెక్నాలజీ
స్మార్ట్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ యాక్సెస్ లేని వినియోగదారులు డిజిటల్ ఎకానమీలో భాగస్వామ్యులు కావడానికి యూపీఐ 123 పే విధానం ఉపయోగపడుతుంది. ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు ఈ విధానాల ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.