Chalo Raj Bhavan : అదానీ వ్యవహారంపై టీపీసీసీ 'చలో రాజ్ భవన్' నిరసన ర్యాలీ, రోడ్డుపై బైఠాయించిన సీఎం
Chalo Raj Bhavan : అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ వద్ద రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు
Chalo Raj Bhavan : అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం వైఖరికి నిరసగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు 'చలో రాజ్ భవన్' కు పిలుపునిచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లారు.
రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజ్ భవన్ వరకూ వెళ్లారు. అనంతరం రాజ్‌భవన్ సమీపంలో రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి....అదానీ-మోడీ సంబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆరోపించారు. దేశంలో వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి సృష్టించారని మండిపడ్డారు. అదానీ అవకతవకలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ విషయంలో ప్రధాని మోదీ కనీసం మాట్లాడటానికి కూడా సిద్ధపడడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను కాపాడిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని దుయ్యబట్టారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తాకట్టుపెట్టారన్నారు. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, అదానీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదిక ఇవ్వడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుందని ఆరోపించారు. దేశం పరువును తీసిన అదానీపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ అవినీతిపై చర్చకు, జేపీసీకి కేంద్రంలోని బీజేపీ సిద్ధంగా లేదని రేవంత్ ఆరోపించారు. జేపీసీ వేస్తే అదానీ జైలుకి వెళ్లాల్సి వస్తుందని, ఆయన్ను కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్నారు.
బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది
"బీఆర్ఎస్ నేతలు సన్నాసులు, వాళ్లు చెయ్యరు, మేము చేస్తే తప్పు పడుతారు. మేము నిరసన చేస్తుంటే మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. బీఆర్ఎస్ అదానీ, మోదీకి లొంగిపోయింది. అందుకే ఇలాంటి నిరసనలను తప్పు పడుతున్నారు. బీఆర్‌ఎస్ కు కనీస నైతిక హక్కు లేదు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, ఈ కార్యక్రమాన్ని దేశ భవిష్యత్తుకు, ప్రజల సంక్షేమానికి బాధ్యత వహిస్తున్నారు. అరెస్ట్‌ల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయింది. అందుకే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు"- సీఎం రేవంత్ రెడ్డి
మోదీ-కేసీఆర్ బొమ్మాబొరుసు
మోదీ-కేసీఆర్ ఇద్దరూ వేర్వేరు కాదని, ఇద్దరూ నాణానికి బొమ్మాబొరుసు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే అదానీ అవినీతిపై జేపీసీకి డిమాండ్ చేయాలన్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ కోరితే అసెంబ్లీలో చర్చకు అనుమతిస్తామన్నారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నారు.
సంబంధిత కథనం