TG ROR New Bill 2024 : భూముల నిర్వహణకు కొత్త చట్టం..! అసెంబ్లీలో 'భూ భారతి' బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్-minister ponguleti srinivasa reddy introducing the telangana bhu bharati bill 2024 in telangana assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ror New Bill 2024 : భూముల నిర్వహణకు కొత్త చట్టం..! అసెంబ్లీలో 'భూ భారతి' బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్

TG ROR New Bill 2024 : భూముల నిర్వహణకు కొత్త చట్టం..! అసెంబ్లీలో 'భూ భారతి' బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 18, 2024 12:06 PM IST

Telangana Bhu Bharati Bill 2024 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం భూ భారతి బిల్లును ప్రవేశపెట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముసాయిదాలోని కీలక అంశాలను సభలో ప్రస్తావించారు.

తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం కీలక బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. భూభారతి బిల్లును ప్రవేశపెట్టింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో మాట్లాడుతూ… కీలక వివరాలను వివరించారు. అర్వోఆర్-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు.

రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సినవి కూడా కోర్టులకు చేరాయని మంత్రి పొంగులేటి చెప్పారు. భూయజమానికి తెలియకుండానే భూమి చేయి దాటిపోయిందని ప్రస్తావించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త ముసాయిదా సిద్ధం చేశామన్నారు.  పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటన్నింటిని సరిదిద్దేలా… కొత్త ముసాయిదా తీసుకొచ్చామని చెప్పారు.

తహసీల్దార్లతోపాటు ఆర్డీవోలకూ మ్యుటేషన్‌ చేసే అధికారం ఇచ్చేలా ముసాయిదా రూపొందించారు. మ్యుటేషన్‌ సమయంలో విచారణకు అవకాశం కల్పిస్తుండగా… తప్పుగా తేలితే మ్యుటేషన్‌ నిలిపివేసే అధికారాలను కట్టబెట్టనుంది. ప్రతి భూకమతానికి భూ ఆధార్‌ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. అప్పీల్, రివిజన్‌లకు వెసులుబాటు కల్పిస్తూ బిల్లును రూపొందించారు. గతంలో అప్పీల్ కు అవకాశం లేకుండా చట్టం చేశారని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. 

ఆర్వోఆర్‌ రికార్డుల్లో తప్పులుంటే వాటిపై మొదటి అప్పీలుపై రివిజన్‌ అధికారాలు కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్‌కు ఇవ్వనున్నారు, ఇక రెండో అప్పీలుపై సీసీఎల్‌ఏకు, మూడో అప్పీలుపై ప్రభుత్వానికి చేసుకునే వీలు ఉంటుంది.

కొత్త బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెప్పాయి. కనీసం సమయం ఇవ్వకుండా అర్ధరాత్రి ముసాయిదా బిల్లును వెబ్ సైట్ లో ఉంచారని.. ఇలా ఉంటే ఎలా ప్రిపేర్ అవుతారని అభ్యంతరం చెప్పారు. ఇవాళే సభలో ప్రశవేపెట్టి.. ఆమోదముద్ర వేయటం సరికాదని ఎంఐఎం, బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ సభ్యులు చెప్పుకొచ్చారు. రేపు పూర్తిస్థాయిలో చర్చ జరగాలని కోరారు. సభ్యులకు సవరణ ప్రతిపాదన అవకాశం ఇవ్వాలని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… స్పీకర్ అనుమతి ఇస్తే రేపు చర్చ జరుపుతామని ప్రకటించారు.

Whats_app_banner