AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి కుళాయితో తాగునీటి సరఫరా, అమృతధార పేరుతో జలజీవన్ మిషన్‌ అమలు చేస్తామన్న పవన్-pawan kalyan says he will implement jaljeevan mission under the name of amrutdhara ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Amrutadhara: ఏపీలో ఇంటింటికి కుళాయితో తాగునీటి సరఫరా, అమృతధార పేరుతో జలజీవన్ మిషన్‌ అమలు చేస్తామన్న పవన్

AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి కుళాయితో తాగునీటి సరఫరా, అమృతధార పేరుతో జలజీవన్ మిషన్‌ అమలు చేస్తామన్న పవన్

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 18, 2024 01:46 PM IST

AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే పథకాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. కేంద్రం నిధులతో చేపట్టే జలజీవన్ మిషన్‌‌కు ఏపీలో అమృతధార ప్రాజెక్టుగా కొనసాగించనున్నామని ప్రతి ఒక్కరికి 55లీటర్ల మంచినీటిని ఇంటికే సరఫరా చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ జలజీవన్ మిషన్‌ వర్క్‌షాప్‌లో స్టాళ్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్‌ జలజీవన్ మిషన్‌ వర్క్‌షాప్‌లో స్టాళ్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్

AP AmrutaDhara: ఆంధ్రప్రదేశ్‌లో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగు నీరు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కుళాయి ద్వారా నాణ్యమైన ‌మంచి నీరు అందించాలన్నదే ఈ పధకం లక్ష్యమని వివరించారు. 2019 ఆగష్టు లో‌ ఈ పథకం ప్రారంభమైనా బోర్ వెల్స్ ద్వారా నీటిని అందించడానికే పరిమితమయ్యిందన్నారు. జల్ జీవన్ మిషన్ అమలు పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను లెమన్ ట్రీ హోటల్ లో బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి 55‌ లీటర్లు నీటిని ఇచ్చేలా కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. నీటి సరఫరా లో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూస్తున్నామని, రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను అమృత ధార పేరు తో అమలు చేస్తామని వివరించాుు.

జల్ జీవన్ మిషన్ లో లోపాలు, ఇబ్బందులు సరి‌చేసి త్రాగు నీటిని అందిస్తామన్నారు. నీరు దొరకని సమయాల్లోనే మనకు నీటి విలువ తెలుస్తుందని, పని చేసే సమయం లో ఆచరణలో ఎన్నో‌ సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే ఇందులో అనేక లోపాలు తెలిశాయన్నారు. పథకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా లక్ష కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు అడిగారని, 2019లో చిన్న రాష్ట్రం కేరళ‌ రూ. 46 వేల కోట్లు అడిగితే.. గత ప్రభుత్వం మన ఏపి లో మాత్రం రూ. 26 వేల కోట్లే అడిగిందని వివరించారు.

పథకం అమలుకు రాష్ట్రం తరపున వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వక పోవడం వల్ల‌ జల జీవన్ మిషన్ అమలు కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర పెద్దలతో, మంత్రి సీ ఆర్ పాటిల్ తో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చెప్పారని, నాలుగు వేల కోట్ల నిధులను సద్వినియోగం చేయలేక పోయారన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు‌ విరుద్ధంగా పని చేశారని, రిజర్వాయర్ ల ద్వారా నీటిని తీసుకోవాల్సి ఉండగా.. వాటి పై దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో నీటి సరఫరా పై దృష్టి పెట్టిందని, మంత్రి సి.ఆర్. పాటిల్ దగ్గర కూడా మన రాష్ట్రానికి రూ. 70 వేల కోట్లు ఇవ్వాలని కోరినట్టు వివరించారు. ఆ ప్రాజెక్టు వివరాలు మొత్తం నివేదిక రెడీ చేసి జల శక్తి మంత్రికి జనవరి, 2025 న అందచేస్తామన్నారు.

పని చేయాలనే తపన ఉన్న అధికారులు రాష్ట్రం లో ఉన్నారని, ఎక్కడకి వెళ్లినా పైపులు వేశారు.. నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు చేశారని, పిఠాపురం లో కూడా సన్నగా పైప్స్ ద్వారా నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం 70.40 లక్షల గృహాలకు ఇచ్చినట్లు చెప్పారని, దీని‌పై పల్స్ సర్వే చేస్తే 55.30 లక్షల మందికి మాత్రమే నీటి కుళాయిలు పెట్టినట్లు తేలిందన్నారు. ప్రతి జిల్లాలో నీటి సరఫరా కు ఉన్న ఇబ్బందులు, వనరులు తెలుసుకునేందుకు వర్కు షాపు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

పైపు లైన్ల డిజైన్ లు కూడా గందరగోళం గా ఉన్నాయని, వాటిని కూడా సరిచేస్తామన్నారు. ఇంజనీరింగ్ అధికారులు కూడా పైప్స్ ద్వారా సరిగా నీటి ధార వచ్చేలా చూడాలని, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకపోతే బాధ కలుగుతుందన్నారు. కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, జనవరి, 2025 కి పూర్తి అయ్యే ఈ ప్రాజెక్టు ను పొడిగించి నిధులు ఇవ్వాలని కోరానని చెప్పారు. గ

త ప్రభుత్వం లో కనీసం పాడైపోయిన పైపు లైన్ లను కూడా క్లీన్ చేయలేదని, అమృత ధార కింద ఈ‌ స్కీం అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నామన్నారు. అధికారులు అందరూ మీ ప్రాంతం లో పరిస్థితులను బట్టి మంచి మార్గాలు గుర్తించాలని, మనసు పెట్టి .. లక్ష్యాలను సాధించేలా సహకరించాలని కోరారు.

Whats_app_banner