IPS Marriage Dispute: మాజీ ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం, కాంగ్రెస్ జెండాలతో ర్యాలీ.. నిలిచిన ఐపీఎస్ పెళ్లి
IPS Marriage Dispute: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో హంగామా చేయడంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు.. పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించడం కలకం రేపింది. మంగళవారం రాత్రి గుంటూరులో ఈ ఘటన జరిగింది.
IPS Marriage Dispute: కూతురు పెళ్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు చేసిన హంగామాతో చివరకు పెళ్లి నిలిచిపోయింది. తెలంగాణలోని గద్వాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. వధువు డాక్టర్‌గా పనిచేస్తున్నారు. పెళ్లి కొడుకు గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పని చే స్తున్నారు. ప్రస్తులం ప్రొబేషన్‌లో ఉన్నారు. పెళ్లి సంబంధం ఖరారైన నేపథ్యంలో మంగళవారం రాత్రి గుంటూరు నగరంలోని ప్రైవేట్ స్కూల్లో పెళ్లి నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో మంగళవారం యువ ఐపీఎస్ అధికారి వివాహం అర్థాంతరంగా నిలిచిపోయింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ నాయకుడి కుమార్తెతో ఐపీఎస్ అధికారి వివాహానికి మంగళవారం ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలోని డాన్ బాస్కో స్కూల్లో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పెళ్లి వేదికకు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాలతో హంగామాతోమాజీ ఎమ్మెల్యే అనుచరులు హడావుడి చేశారు. వివాహానికి ముందు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పట్టాభిపురం మెయిన్ రోడ్డులోని జ్యూట్ మిల్లు నుంచి పెళ్లి జరిగే స్కూల్ వరకు పెళ్లికొడుకుతో ఊరేగింపుగా వెళ్లాలని వధువు బంధువులు చెప్పారు.
గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన పెళ్లి కొడుకు తాను సివిల్ సర్వీసెస్‌లో ఉన్నందున రాజకీయ జెండాలతో హడావుడి చేయడం తగదని పెళ్ళి కుమార్తె తరపు వారికి చెప్పాడు. అయితే అమ్మాయి బంధువులు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు దానిని పట్టించుకోకుండా పెళ్లి వేడుక వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాలతో హంగామా కొనసాగించారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు పెళ్ళిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాడు. విషయం తెలియడంతో పెళ్ళికూతురు తల్లి అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. వధువు తల్లికి గుండె పోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వరుడి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వరుడు గుంటూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భారీ ఎత్తున పోలీసులను మొహరించారు.
దీంతో పెళ్లి కొడుకు ఇంటిముందు మంగళవారం రాత్రి పెళ్ళికూతురు బంధువులు ఆందోళనకు దిగారు. మొదట సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించిన వరుడు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వరుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, సుంకర పద్మశ్రీతో పాటు పలువురు నాయకులు వరుడి ఇంటికి చేరుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.
వరుడి తరపున స్థానిక చర్చి పెద్దలు మధ్యవర్తిత్వం వహించారు. అర్థరాత్రి వరకు ఈ చర్చలు కొనసాగాయి. పెళ్లి ఊరేగింపుపై వరుడు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో జరిగిన ఘటనపై వధువు తరపు బంధువులు విచారం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల మధ్య చివరకు సయోధ్య కుదరడంతో పెళ్లి చేసుకోడానికి యువ ఐపీఎస్ అధికారి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. బుధవారం ఉదయం పెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహించారు.