Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డ్రా.. 216 ఓవర్లే సాగిన ఆట-ind vs aus 3rd test drawn rain in brisbane force no result in gabba test only 216 overs bowled in 5 days ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test: వదలని వర్షం.. ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డ్రా.. 216 ఓవర్లే సాగిన ఆట

Ind vs Aus 3rd Test: వదలని వర్షం.. ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డ్రా.. 216 ఓవర్లే సాగిన ఆట

Hari Prasad S HT Telugu
Dec 18, 2024 11:26 AM IST

Ind vs Aus 3rd Test: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్ లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం సాధ్యం కాలేదు. చివరి రోజు ఇండియా ముందు ఆస్ట్రేలియా 275 పరుగుల లక్ష్యం ఉంచినా.. 2 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో ఇక ఆట సాధ్యం కాలేదు.

వదలని వర్షం.. ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డ్రా.. 216 ఓవర్లే సాగిన ఆట
వదలని వర్షం.. ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ డ్రా.. 216 ఓవర్లే సాగిన ఆట (AFP)

Ind vs Aus 3rd Test: గబ్బా టెస్టు పేలవ డ్రాగా ముగిసింది. తొలి రోజు మొదలైన వర్షం చివరి రోజు వరకూ కొనసాగడంతో ఫలితం సాధ్యం కాలేదు. మ్యాచ్ మొత్తం ఐదు రోజుల్లో కేవలం 216 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చివరి రోజు అయితే మొత్తంగా 24 ఓవర్లే వేయగలిగారు.

టీమిండియా ముందు ఆస్ట్రేలియా 275 రన్స్ టార్గెట్ విధించగా.. 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఆ సమయంలో వెలుతురు సరిగా లేకపోవడం, తర్వాత వర్షం కురవడంతో ఇక ఆట సాధ్యం కాలేదు.

గబ్బా టెస్టు డ్రా

మూడేళ్ల కిందట ఇదే గబ్బాలో చారిత్రక విజయం సాధించిన టీమిండియా.. ఈసారి మాత్రం వర్షం వల్ల బతికిపోయిందని చెప్పొచ్చు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. టీమిండియా కిందామీదా పడి 260 రన్స్ చేసి ఫాలో ఆన్ తప్పించుకుంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 7 వికెట్లకు 89 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. 275 రన్స్ తో టీమిండియాకు సవాలు విసిరింది. అయితే ఆ సవాలును వరుణుడు సీరియస్ గా తీసుకొని.. ఇండియా ఇన్నింగ్స్ మొదలు కాగానే మళ్లీ వచ్చాడు. దీంతో 2.1 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 8 రన్స్ చేసింది.

అప్పుడే వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపేసి ముందుగానే టీ టైమ్ తీసుకున్నారు. ఆ సమయం ముగిసే సరికి వర్షం మళ్లీ మొదలైంది. ఈసారి భారీ వర్షం కురవడంతో మళ్లీ ఆట సాధ్యం కాలేదు. వర్షం ఆగకపోవడంతో ఇద్దరు కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ఇప్పటికీ 1-1తో సమంగా ఉంది.

ఫలితం కోసం ఆస్ట్రేలియా సాహసం

టీమిండియాను తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు కట్టడి చేసి 185 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆ టీమ్.. రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 89 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. మొత్తంగా 274 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్ లో ఫలితం కోసం ఆ టీమ్ సాహసమే చేసింది. కానీ వర్షంతో దానికి ఫలితం లేకుండా పోయింది.

రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మొదటి నుంచీ ఆ టీమ్ బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. దీంతో వికెట్లు పడుతూనే వెళ్లాయి. బుమ్రాు 3, సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ కమిన్స్ 22 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Whats_app_banner