AP New Toll Charges: ఏపీలో టోల్‌ ఫీజుల బాదుడు, అన్ని టోల్‌ గేట్లలో సింగల్‌ ఎంట్రీ వసూళ్లు, జనం జేబులకు చిల్లు-toll fees in ap are skyrocketing single entry charges at all toll gates a hole in peoples pockets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Toll Charges: ఏపీలో టోల్‌ ఫీజుల బాదుడు, అన్ని టోల్‌ గేట్లలో సింగల్‌ ఎంట్రీ వసూళ్లు, జనం జేబులకు చిల్లు

AP New Toll Charges: ఏపీలో టోల్‌ ఫీజుల బాదుడు, అన్ని టోల్‌ గేట్లలో సింగల్‌ ఎంట్రీ వసూళ్లు, జనం జేబులకు చిల్లు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 18, 2024 02:40 PM IST

AP New Toll Charges: ఆంధ్రప్రదేశ్‌లో టోల్‌ ఫీజులు జనం జేబులకు చిల్లు పెడుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సింగల్‌ ఎంట్రీ ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో జనంపై భారీగా భారం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపె 65టోల్‌ గేట్లలో ఇదే రకమైన వసూళ్లు అమలవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ టోల్‌ ప్లాజాల్లో దోపిడీ
ఆంధ్రప్రదేశ్‌ టోల్‌ ప్లాజాల్లో దోపిడీ

AP New Toll Charges: ఆంధ్రప్రదేశ్‌ టోల్‌ ప్లాజాలలో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫాస్ట్‌ ట్యాగ్‌ వినియోగంతో జనానికి అప్పటికప్పుడు ఎంత కోత పడుతుందో తెలియకపోయినా టోల్ వసూళ్లు లెక్క బయటపడేసరికి జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రతి టోల్‌ గేట్‌ వద్ద సింగల్ ఎంట్రీని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రిపెయిడ్‌ తరహాలో ఫాస్ట్‌ ట్యాగ్‌లను వినియోగిస్తుండటంతో టోల్‌ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో వాహనాలకు అప్పటికప్పుడు తెలియడం లేదు.

గత కొన్ని వారాలుగా ఒక రోజులో ఎన్నిసార్లు జాతీయ రహదారుల మీదుగా టోల్‌ ప్లాజాలను క్రాస్్ చేస్తే అన్నిసార్లూ విడివిడిగా టోల్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారిపై పెదకాకాని- కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో ఒక్కసారి ప్రయాణిస్తే రూ.160 ఛార్జీ వసూలు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో 24గంటల్లోపు అందులో సగమే వసూలు చేసేవారు.

బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్ విధానంలో నిర్మించిన జాతీయ రహదారుల గడువు ముగియడంతో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో అయా రహదారులపై వాహనం ఎన్నిసార్లు ప్రయాణిస్తే అన్నిసార్లు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాలల్లో ఇదే పరిస్థితి ఉంది. వీటి నిర్మాణం, బీవోటీ గడువు ముగియడంతో అక్టోబరు నుంచి కొత్త నిబంధలన ప్రకారం టోల్ వసూలు చేస్తున్నారు.

సెప్టెంబరు నెల వరకు జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లకు ఒకవైపు ప్రయాణానికి రూ. 160 తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో ఆ కారు ప్రత్యేకంగా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ మొదటి వైపు ప్రయాణానికి ఒకవైపు పూర్తి ఫీజుతో పాటు రెండోసారి సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు.

విజ యవాడ-గుంటూరు మధ్య నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగులు వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. తాజా నిబంధనతో వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది. టోల్ ఫీజుల మార్పులు గురించి ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా ఫాస్ట్‌టాగ్‌లో వసూలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజల నుంచి అడ్డగోలుగా టోల్‌ ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులపై మొత్తం 69 టోల్ ప్లాజాలు ఉన్నాయి. 65 టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని తీసర టోల్ ప్లాజాను కొద్ది కాలం క్రితమే జిఎంఆర్‌ నిర్మాణం చేపట్టింది. నెల్లూరు-చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం, బూదరం, సూళ్లూరుపేట కలిపి మొత్తం 4 చోట్ల మాత్రమే పాత విధానంలో వాహనాలకు టోల్ వసూలు చేస్తున్నట్టు ఎన్‌హెచ్ అధికారులు చెబుతున్నారు.

నాలుగు టోల్‌ ప్లాజాల్లో 24 గంటల్లోపు ఎన్ని సార్లు రాకపోకలు సాగించినా.. ఒకసారి పూర్తిఫీజు, రెండోసారి సగం ఫీజు మాత్రమే తీసుకుంటారు. వీటి నిర్మాణం కొత్తగా జరగడంతో కాంట్రాక్టర్లకు బీవోటీ గడువు 2031 వరకు ఉంది. అప్పటివరకు పాత పద్ధతిలోనే వసూలు చేస్తారు. మిగిలిన 65టోల్‌ ప్లాజాల్లో ఫాస్ట్‌ టాగ్‌ కోతలు తప్పడం లేదు.

Whats_app_banner