CM Revanth Reddy : తెలంగాణ కులగణన 98 శాతం పూర్తి, మెగా హెల్త్ ప్రొఫైల్ కు అడుగు దూరంలో - సీఎం రేవంత్ రెడ్డి-hyderabad cm revanth reddy says caste census completed 98 percent mega health profile ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : తెలంగాణ కులగణన 98 శాతం పూర్తి, మెగా హెల్త్ ప్రొఫైల్ కు అడుగు దూరంలో - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ కులగణన 98 శాతం పూర్తి, మెగా హెల్త్ ప్రొఫైల్ కు అడుగు దూరంలో - సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Dec 14, 2024 09:35 PM IST

CM Revanth Reddy : తెలంగాణలో కులగణన 98 శాతం పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన రెండు శాతం కూడా పూర్తైత తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచే మెగా హెల్త్ ప్రొఫైల్ గా మారుతుందన్నారు.

తెలంగాణ కులగణన 98 శాతం పూర్తి, మెగా హెల్త్ ప్రొఫైల్ కు అడుగు దూరంలో - సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ కులగణన 98 శాతం పూర్తి, మెగా హెల్త్ ప్రొఫైల్ కు అడుగు దూరంలో - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో కులగణన చేపట్టామని సీఎం చెప్పారు. మిగిలిన రెండు శాతం పూర్తయితే దేశానికే ఆదర్శంగా నిలిచే కులగణన తెలంగాణ ప్రజల మెగా హెల్త్ ప్రొఫైల్‌గా మారుతుందని అన్నారు.

హైదరాబాద్‌లో నిర్మించిన కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ – దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... దొడ్డి కొమురయ్య గారి పోరాటాలను స్మరించుకున్నారు. రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా, దొరల పెత్తనాన్ని అడ్డుకోవడానికి దుడ్డుకర్రల సంఘం పెట్టి పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అన్నారు.

చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టినట్టుగానే, దొడ్డి కొమురయ్య శాశ్వతంగా గుర్తుండిపోయేలా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దొడ్డి కొమురయ్య భవన ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలన్నారు. కురుమ సోదరులకు విద్య కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రుణమాఫీ, వరికి బోనస్, ఉచిత విద్యుత్, రూ.500 లకే సిలిండర్, పేదలకు వైద్య సౌకర్యాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా బలహీన వర్గాలకు అందాయని చెప్పారు.

"తెలంగాణకు జమిందారుల తల్లి కాదు. బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలి. ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో, అడక్కుండానే మన ఆకలిని గుర్తించి బుక్కెడు అన్నం పెడుతుందో అలాంటి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాం. మన అమ్మకు ప్రతిరూపం. మన అక్కకు ప్రతిరూపం. ఒకపక్క వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి తెలంగాణలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి. నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పథంవైపు నడవాలని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని మనం ప్రతిష్టించుకున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తాం

ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంక్లిష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ మాదిగ, చమర్ ఇతర అనుబంధ కులాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వర్గీకరణ అంశంలో న్యాయపరమైన చిక్కలు తలెత్తకుండా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే అధ్యయనానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించామని అన్నారు. అలాగే, వర్గీకరణ అంశంపై 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శమీమ్ అఖ్తర్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ను నియమించామని, మరో వారం రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

Whats_app_banner