Tiruvuru Mla: ఆ ఎమ్మెల్యేతో టీడీపీకి తిప్పలు, కొలికపూడి తీరుతో తల పట్టుకుంటోన్న టీడీపీ పెద్దలు-tdp leaders are holding back with that mla kolikapudis style is causing trouble for tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tiruvuru Mla: ఆ ఎమ్మెల్యేతో టీడీపీకి తిప్పలు, కొలికపూడి తీరుతో తల పట్టుకుంటోన్న టీడీపీ పెద్దలు

Tiruvuru Mla: ఆ ఎమ్మెల్యేతో టీడీపీకి తిప్పలు, కొలికపూడి తీరుతో తల పట్టుకుంటోన్న టీడీపీ పెద్దలు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 18, 2024 03:04 PM IST

Tiruvuru Mla: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి తలనొప్పిగా తయారైన ఎమ్మెల్యేల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒకరు. పార్టీ నేతలతో వివాదాలు, కర్ర పెత్తనం, దూషణలతో తీరు మార్చుకోమని పార్టీ పెద్దలు పదేపదే చెబుతున్నా ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు.

తిరువూరు బెల్ట్‌షాప్‌లో మద్యం బాటిళ్లతో ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు బెల్ట్‌షాప్‌లో మద్యం బాటిళ్లతో ఎమ్మెల్యే కొలికపూడి

Tiruvuru Mla: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం బెల్ట్‌షాపులపై దాడుల పేరుతో చేసిన హడావుడితో టీడీపీ ఇరకాటంలో పడింది. రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్‌షాపులే లేవని ఓ పక్కన ఎక్సైజ్‌ మంత్రి మొదలుకుని ముఖ్యమంత్రి వరకు గొప్పలు చెబుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్లపై పరుగులు తీస్తూ బెల్టు దుకాణాల్లో తనిఖీలు చేస్తూ, అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని పట్టుకోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే ఇలా ఎందుకు చేశారనే దానిపై రకరకాల వాదనలు ఉన్నా టీడీపీ నేతలు మాత్రం ఎమ్మెల్యే తీరును తప్పు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే కొలికపూడి కంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యారు.

అధ్యాపక వృత్తి నుంచి అమరావతి ఉద్యమంలోకి అడుగుపెట్టిన కొలికపూడి శ్రీనివాసరావును ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు రిజర్వుడు నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. కూటమి ప్రభంజనంలో సునాయసంగానే గెలిచారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తీరులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. నియోజక వర్గం మొత్తం తన చెప్పు చేతల్లో ఉండాలనే ధోరణిలో ఉండటంతో స్థానికంగా విభేదాలు మొదలయ్యాయి. దీనికి తోడు స్థానికంగా ఉండే కుల, వర్గ రాజకీయాలు కూడా ఎమ్మెల్యేకు మింగుడు పడలేదు. తిరువూరులో ఉండే కుల ఆధిపత్య ధోరణులు కూడా ఎమ్మెల్యే వైఖరికి కారణమనే ప్రచారం కూడా ఉంది.

ఎమ్మెల్యేగా ఎన్నికైన నెలరోజుల్లోనే.. ఈ ఏడాది జూలైలో ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నాయ కుడు పంచాయతీ స్థలం ఆక్రమించి, భవనం నిర్మిస్తు న్నాడని ఆరోపిస్తూ ఆ భవనం వద్దకు వెళ్లి జేసీబీతో దానిని పడగొట్టాల్సిందేనని ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటా మని అధికారులు చెప్పినా వినకుండా అక్కడే బైఠాయించారు. ఈ ఘటన సంచలనం కావడంతో టీడీపీ అధ్యక్సుడు చంద్రబాబు ఉండవల్లి పిలిపించుకుని మందలించారు.

ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే నెపంతో టీడీపీ ప్రజాప్రతినిధిని అందరి ముందు బట్టలిప్పి కొడతానంటూ బెదిరించడంతో అతని భార్య ఆత్మహత్యా యత్నం చేసింది. దీంతో అతని వర్గం నాయకులు విజయవాడలో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడం కలకలం రేపింది. తిరువూరులో మట్టి తరలింపుపై మీడియాలో వార్తలు రావడంతో వారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై స్థానిక నాయకులు టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండగానే నియోజక వర్గానికి మరో ఇన్‌ఛార్జిని నియమించారు. పార్టీలో ఇతర నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో తీరు మార్చుకుంటానని బహిరంగంగా ప్రకటించారు.

మంగళవారం మళ్లీ కొలికపూడి చెలరేగిపోయారు. వీధుల్లో పరుగులు తీస్తూ మద్యం దుకాణాల వద్ద హంగామా చేశారు. ఉదయాన్నే మద్యం షాపులకు వెళ్లి బెల్టు షాపులు నిర్వహిస్తున్నారంటూ షాపులకు తాళాలు వేయిం చారు. షాపు తాళాలు తీస్తే ఊరుకోనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరు పట్టణంలో ఉన్న షాపుల్ని పట్టణ శివార్లలో పెట్టుకోవాలని, బెల్టుషాపుల్ని తొలగించకపోతే తానే తొలగిస్తానంటూ మండిపడ్డారు.

తిరువూరు నియోజక వర్గంలో ఉన్న 16 మద్యం షాపుల్లో తిరువూరు పట్టణంలో 4, రూరల్‌లో 2, గంపలగూడెంలో 4, ఎ. కొండూరులో 2, విన్నన్నపేటలో 4 షాపులు ఉన్నాయి. మద్యం వ్యాపారంపై ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం దుకాణాలు మూయించడంపై నిర్వాహకులు బిత్తరపోతున్నారు. ఎమ్మెల్యే వేధింపులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విచారణ జరుపుతోంది.

Whats_app_banner