చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే పానీయాలను తీసుకోవడం ద్వారా బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. టీ, కాఫీలకు బదులుగా మసాలా మిల్క్ తాగేందుకు ప్రయత్నించండి. ఈ మసాలా మిల్క్‌ను తయారు చేసేందుకు ముందుగా మసాలా పొడి అవసరం. ఇక్కడ మేము మిల్క్ మసాలా పొడి ఎలా తయారు చేయాలో చెప్పాము. దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది.
జీడిపప్పులు - అర కప్పు
బాదం పప్పులు - అరకప్పు
పిస్తా - అరకప్పు
పసుపు పొడి - ఒక స్పూను
మిరియాలు - అర స్పూను
యాలకులు - ఆరు
పాలు - ఒక గ్లాసు
పంచదార - పావు కప్పు
1. స్టవ్ మీద కళాయి పెట్టి బాదం, జీడిపప్పు, పిస్తాలను వేయించుకోవాలి.
2. అవి బాగా వేగాక ఏలకులు, మిరియాలు వేసి వేయించాలి.
3. అవి చల్లారాక వాటన్నింటినీ మిక్సీ జార్లో వేయాలి.
4. పంచదారను కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
5. ఆ పొడిని గాలి చొరబడని కంటైనర్ లో వేసి మూత పెట్టి దాచుకోవాలి. అంతే మసాలా మిల్క్ పొడి రెడీ అయినట్టే.
6. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేడి పాలను తీసుకొని అందులో రెండు స్పూన్లు మసాలా మిల్క్ పొడి వేసి బాగా కలుపుకోవాలి.
7. లేదా టీ కాచుకున్నట్టే పాలల్లో ఈ మసాలా మిల్క్ పొడి వేసి కాసేపు మరగ కాచాలి.
8. ఆ తర్వాత ఒక గ్లాసులో వేసుకొని వేడి వేడిగా తాగితే రుచి అదిరిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు ముక్కు సమస్యలు రాకుండా ఉంటాయి.
ఈ మసాలా మిల్క్ పొడిని చలికాలంలోనూ, ఎండాకాలంలో కూడా తీసుకోవచ్చు. చలికాలంలో వేడిగా తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఎండాకాలంలో చల్లగా తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. శక్తిని కూడా అందిస్తుంది.