Sugar Diseases: పంచదార తినడం వల్ల డయాబెటిస్ మాత్రమే కాదు ఈ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది
Sugar Diseases: పంచదార అధికంగా తినడం ఆరోగ్యకరం కాదు. డయాబెటిస్‌తో పాటూ అనేక రోగాలు పంచదార వల్ల వస్తాయి. పంచదార తింటే ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
Sugar Diseases: పంచదార వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. పంచదారతో అనేక రకాల తీపి పదార్థాలు చేస్తారు. వాటి రుచి కోసం అధికంగా తింటే అందులో ఉండే పంచదార శరీరంలో అధికంగా చేరుతుంది. వయసు పెరిగాక పంచదార అధికంగా తింటే మధుమేహం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. పంచదారను అధికంగా తినడం వల్ల కేవలం డయాబెటిస్ మాత్రమే కాదు, ఇతర రోగాలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
కేవలం పంచదారతో చేసిన ఆహారాల వల్లే కాదు ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల కూడా చక్కెర శాతం శరీరంలో పెరిగిపోతుంది. అన్నం తినడం ద్వారా కూడా చక్కెర పెరుగుతుంది. నేరుగా షుగర్ తో చేసిన ఆహారాలు తినకపోయినా కొన్ని రకాల ఆహారాలు మీలో చక్కెర శాతాన్ని పెంచేస్తాయి. చిప్స్, ఉప్పగా ఉండే బిస్కెట్లు తినడం వల్ల కూడా శరీరంలో చక్కెర శాతం పెరిగే అవకాశం ఉంది.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కూడా చక్కెర అధికంగా శరీరంలో చేరిపోతుంది. నాలుగు గ్రాముల కార్బోహైడ్రేట్లు తినడం వల్ల ఒక టీ స్పూన్ చక్కెర శరీరంలో చేరుతుంది. అదే 15 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం తింటే నాలుగు స్పూన్ల చక్కెరను తిన్నట్టే. మైదాతో చేసిన రొట్టె తిన్నా కూడా నాలుగు స్పూన్ల పంచదార నేరుగా తిన్నట్టే. అదే మీరు బ్రేక్ ఫాస్ట్‌లో మూడు మైదాతో చేసిన బ్రెడ్డు ముక్కలు తింటే పది నుంచి 12 స్పూన్ల పంచదార తినడంతో సమానం.
పంచదార అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు. బరువు పెరగడం వల్ల అధికరక్తపోటు సమస్య వస్తుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీర కణాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. చక్కెర నిండిన పానీయాలు తాగడం వల్ల గౌట్ సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కరోనరీ హార్ట్ డిసీజ్‌లు వచ్చే అవకాశం కూడా చక్కెర పెంచేస్తుంది.దంతక్షయాలు వచ్చే అవకాశాన్ని పంచదార పెంచేస్తుంది. చక్కెర వల్ల రక్తనాళాల్లో కొవ్వు శాతం పెరిగిపోతుంది. చక్కెర వల్ల మధుమేహం వస్తే పైల్స్ సమస్య కూడా వచ్చేస్తుంది.
పంచదార అధికంగా తినడం వల్ల ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. గుండె కండరాల ప్రొటీన్లలో అనేక మార్పులకు పంచదార కారణమవుతుంది. ఇది గుండె వైఫల్యానికి కారణం అవుతుంది. కాబట్టి చక్కెర నిండిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
టాపిక్