IND vs AUS: పింక్ బాల్ టెస్టులో ఓడిన టీమిండియాకి సునీల్ గవాస్కర్ ఉచిత సలహా.. హోటల్‌లో ఖాళీగా కూర్చోవడం కంటే..?
India vs Australia 2nd Test: అడిలైడ్ టెస్టులో టీమిండియా ఓడిపోగానే.. భారత్ క్రికెటర్లకి సునీల్ గవాస్కర్ చురకలు అంటించేశాడు. హోటల్‌లో కూర్చోకుండా వెళ్లి…?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. డే/నైట్ టెస్టు ఫార్మాట్‌లో పింక్ బాల్‌తో జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
హోటల్‌లోనే టైంపాస్ చేయొద్దు
పింక్ బాల్‌తో రాణించడంలో భారత జట్టు మరోసారి విఫలమైంది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ప్రదర్శన చాలా నాసిరకంగా ఉంది. అడిలైడ్ టెస్టు 3 రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు హోటల్లో విశ్రాంతి తీసుకోకుండా ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవాలని భారత జట్టు ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు.
రెండుసార్లు.. 200లోపే
అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్ జట్టు 180, 175 పరుగులకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ "అడిలైడ్‌లో ఓడిపోయిన మ్యాచ్ సంగతి వదిలేయండి. సిరీస్‌ను మిగిలిన మూడు మ్యాచ్‌ల కోణంలో చూడండి. మూడో టెస్టుకి ఇంకా 8 రోజులు సమయం ఉండటంతో.. భారత్ ఆటగాళ్లు మరింతగా ప్రాక్టీ్ చేయడానికి సమయం కేటాయించాలి. మీరు క్రికెట్ ఆడటానికి ఇక్కడకు వచ్చారు. కాబట్టి మీరు మీ హోటల్ గదిలో లేదా ఫ్యామిలీతో షికార్లు వెళ్లకుండా ప్రాక్టీస్ చేయండి’’ అని గవాస్కర్ సూచించాడు.
రోజంతా కాకపోయినా..
‘‘అలా అని రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉదయం లేదా మధ్యాహ్నం ప్రాక్టీస్ చేయవచ్చు. దొరికిన ఈ 8 రోజుల్ని వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ అడిలైడ్ టెస్టు మ్యాచ్ ఐదురోజులు జరిగి ఉంటే.. మీరు ఆడుతూనే ఉండేవారు. రెండు రోజులు అదనంగా టైమ్ దొరికింది కాబట్టి.. మ్యాచ్‌లో పరుగులు చేయలేకపోయిన బ్యాటర్లు టచ్‌లోకి రావడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. బౌలర్లు కూడా మంచి లయతో కనిపించలేదు. వాళ్లు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసి లయ అందుకోవాలి’’ అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.
మూడో టెస్టు ఎప్పుడంటే?
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు రెండు డే/నైట్ టెస్టులు ఆడిన టీమిండియా.. రెండింటిలోనూ చిత్తుగా ఓడిపోవడం గమనార్హం.