Electric Kettel Cleaning: ఎలక్ట్రిక్ కెటిల్‌ను మీరూ వాడుతున్నారా? అయితే దాన్ని శుభ్రం చేయడం ఎలాగో తెలుసుకోండి
Electric Kettel Cleaning: ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇప్పుడు చాలా కిచెన్లలో భాగమయ్యాయి. మనమందరం దీనిని ఉపయోగిస్తాము కాని దాని సాధారణ సంరక్షణ గురించి తెలియదు. ముఖ్యంగా దీన్ని శుభ్రం చేయడం విషయంలో ఎన్నో సందేహాలు. మామూలు డిష్ వాషర్లలో ఎలక్ట్రిక్ కెటిల్ను శుభ్రం చేస్తే సరిపోతుందా?
టెక్నాలజీ సహాయం లేకుంటే చాలా పనులు పెండింగ్ లోనే ఉండిపోయే రోజులివి. మన వంటగదిలో కూడా వివిధ రకాల టెక్నాలజీ ఆధారిత ఉపకరణాలతో నిండి పోతుంది. వంటగదిలో ఎక్కువగా వాడే వస్తువుల్లో ముందుండేది ఎలక్ట్రిక్ కెటిల్. నీటిని, టీని మరిగించుకునేందుకు ఈ మధ్య దీన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలంలో దీనికి డిమాండ్ చాలా పెరుగుతుంది. ఉదయాన్నే నిమ్మకాయతో గోరువెచ్చని నీరు తాగడం దగ్గర్నుంచి టీ, కాఫీలు, వేడినీళ్లు తాగడం వరకూ అన్నింటికీ దీన్ని ఉపయోగించవచ్చు. కొంతమంది దీనిని మ్యాగీ తయారు చేయడానికి మరియు గుడ్లను ఉడకబెట్టడానికి కూడా ఉపయోగిస్తారు. ఏదైనా పని దీనికి అప్పగించినప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇది వంట చేసే సమయాన్ని తగ్గిస్తుంది. అందుకే ఇది ప్రతి కిచెన్లో ముఖ్యమైన వస్తువుగా మారింది.
పరిశుభ్రత ఎందుకు ముఖ్యం?
ఎలక్ట్రిక్ కెటిల్‌ను ఇన్ని రకాలుగా వాడుతున్నప్పటికీ దాన్ని సాధారణ సంరక్షణ గురించి చాలా మందికి తెలియదు. మామూలు డిష్ వాషర్ తోనే దీన్ని శుభ్రం చేస్తున్నట్లయితే మీరు పొరపాటు చేస్తున్నట్లే. ఇతర ఎలక్ట్రిక్ వస్తువులకు ఎంత సంరక్షణ అవసరమో ఎలక్ట్రిక్ కెటిల్ ను కూడా అంతే బాగా చూసుకోవాలి. క్రమం తప్పకుండా దీన్ని శుభ్రం చేయాలి. కెటిల్ ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే దానిలో ఖనిజ నిక్షేపాలు నిలిచి పోతాయి. కొన్నిసార్లు ఆహార ముక్కలు కూడా కనిపించకుండా అందులో అతుక్కుపోతాయి. లోపల పసుపు రంగులోకి మారిన ఈ ధూళి పెద్ద పరిమాణంలో పేరుకుపోతే, అది కెటిల్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే ఒక రకమైన దుర్వాసన రావడం మొదలవుతుంది. క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల పనితీరును నిర్వహించడమే కాకుండా ఆహార పదార్థాల రుచిని కూడా పాడు చేయదు.
ఎలక్ట్రిక్ కెటిల్ను శుభ్రం చేయడం ఎలా?
వెనిగర్,నీరు:
కెటిల్ లోపల పసుపు పొర పేరుకుపోతుంది. వెనిగర్, నీళ్ల సాయం తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాన పరిమాణంలో నీరు, వెనిగర్ తీసుకొని దానితో సగం కెటిల్ నింపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగించాలి. కెటిల్‌ను స్విచ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని అందులోనే ఉంచాలి. 20 నిమిషాల తర్వాత కెటిల్ నుండి నీరు, వెనిగర్ మిశ్రమాన్ని తీసి పారేసి తిరిగి కెటిల్‌ను శుభ్రమైన నీటితో కడగాలి. వెనిగర్‌లోని ఆమ్లత్వం కెటిల్‌లో నిలిచిపోయిన ఖనిజాన్ని శుభ్రపరుస్తుంది, దాని వాసన కూడా పోతుంది.
బేకింగ్ సోడా:
మొండి మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నీళ్లు, బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్టును కెటిల్‌లో మచ్చలు ఉన్న భాగాలపై చక్కగా రుద్దండి. బ్రష్ లేదా స్పాంజ్ సహాయంతో రుద్దండి. తరువాత కెటిల్ను శుభ్రమైన నీటితో కడగాలి.
నిమ్మకాయ రసం:
నిమ్మకాయలోని ఆమ్లత్వం శుభ్రతకు ఉపయోగపడుతుంది. ఒకటి లేదా రెండు నిమ్మకాయలను తీసుకుని వాటి రసాన్ని కెటిల్ లోకి పిండండి. ఆపై కెటిల్ ను నీటితో నింపండి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. తరువాత కెటిల్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అరగంట పాటు అందులోనే ఉంచాలి. అరగంట తర్వాత నిమ్మరసం తీసి బయట పారబోసి శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి.
వాషింగ్ లిక్విడ్:
మీరు మీ ఎలక్ట్రిక్ కెటిల్ను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే, మీరు సాధారణ డిష్ వాషింగ్ లిక్విడ్తో కూడా శుభ్రం చేయవచ్చు. కెటిల్ కు లిక్విడ్ డిష్ వాష్ తో శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు గోరువెచ్చని నీరు జోడించి కొన్ని నిమిషాలు అలా వదిలేయండి. కెటిల్ లోపలి భాగాన్ని స్క్రబ్ తో శుభ్రపరచండి. తరువాత సబ్బు ఆనవాళ్లు లేకుండా శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
సిట్రిక్ యాసిడ్:
బయట మార్కెట్లో పౌడర్ రూపంలో లభించే సిట్రిక్ యాసిడ్ సహాయంతో మీరు మీ ఎలక్ట్రిక్ కెటిల్ను శుభ్రం చేయవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ సిట్రిక్ యాసిడ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కెటిల్ లో వేసి మరిగించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, తరువాత కెటిల్ను శుభ్రమైన నీటితో కడగాలి.
సంబంధిత కథనం
టాపిక్