CM Revanth Reddy : అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట-ఇకపై టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులివ్వం : సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy sensational comments on sandhya theatre stampede hero allu arjun arrest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట-ఇకపై టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులివ్వం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట-ఇకపై టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులివ్వం : సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Dec 21, 2024 03:43 PM IST

CM Revanth Reddy : "ఒక రోజు జైలుకెళ్లిన హీరోను ఏదో కాళ్లు, చేతులు పోయిన వ్యక్తిలా పరామర్శించడానికి క్యూకట్టిన సెలబ్రిటీలు...ఓ మహిళ ప్రాణం పోయింది, బాలుడు బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉంటే కనీసం పరామర్శించలేదు" అని సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హీరో అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట, సెలబ్రిటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హీరో అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట, సెలబ్రిటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy : "రూ.30 వేల నెల జీతం ఉన్న ఓ వ్యక్తి...తన కుమారుడి కోసం రూ.12 వేలు పెట్టి టికెట్లు కొని థియేటర్ కు సినిమా చూసేందుకు వెళ్తే...తొక్కిసలాట జరిగి తన భార్యను కోల్పోయాడు. తన కుమారుడికి బ్రెయిన్ డెడ్ అయి వెంటిలేటర్ పై ఉన్నాడు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవద్దా?" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ఈనెల 4న సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సంధ్య థియేటర్‌కు వెళ్లేందుకు ఒక్కటే దారి ఉందని, అక్కడికి రావొద్దని పోలీసులు చెప్పినా హీరో అల్లు అర్జున్‌ లెక్కచేయకుండా వచ్చారని సీఎం తెలిపారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో అల్లు అర్జున్ ఒక రోజు జైలుకు వెళ్లి వస్తే హీరోలు, నిర్మాతలు, సినిమా వాళ్లు వెళ్లి పరామర్శించారన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారిని చూసేందుకు ఒక్కరూ కూడా ఆసుపత్రికి వెళ్లలేదన్నారు. ఒకపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్లు వెళ్లారని మండిపడ్డారు. ఓ మహిళ ప్రాణం పోయిందని, ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"థియేటర్ కు హీరో వస్తున్నారని పోలీసుల బందోబస్తు అడిగారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు. అయినా హీరో అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారు. రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వచ్చారు. దీంతో హీరో రాకను చూసిన ఫ్యాన్స్ ఎగబడ్డారు. అతడి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లు ఫ్యాన్స్ ను ఎలా పడితే అలా నెట్టేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. హీరో థియేటర్ లోకి వెళ్లిన తర్వాత... పైన బాల్కనీలో ఉన్న హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కింద నుంచి జనాన్ని తొక్కుకుంటూ హీరో వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోతుందని పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదు. పోలీసులను అడ్డుకున్నారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆమె బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలుసుకుని పోలీసులు... మీపై కూడా చర్యలు తీసుంటామని చెప్పడంతో హీరో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బయటకు వచ్చినప్పుడు కూడా.. అంటే ఓ మహిళ చనిపోయిందని తెలిసి కూడా రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వెళ్లారు. సీసీ ఫుటేజ్ లో చూస్తే తాను చనిపోతున్నా... బిడ్డకు ఏంకాకూడదని బాలుడి చెయ్యి పట్టుకుని వదల్లేదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్న హీరోపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులు కేసులు పెట్టారు." - సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబరు 2న చిక్కడపల్లి పీఎస్‌లో సంధ్య థియేటర్‌ యాజమాన్యం బందోబస్తు కోసం దరఖాస్తు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4న పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్‌, నిర్మాతతో సహా మరికొంత మంది సంధ్య థియేటర్‌కు వస్తున్నారుని, బందోబస్తు కావాలని కోరారు. ఆ మరుసటి రోజే చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్‌ యాజమాన్యానికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారన్నారు. సంధ్య థియేటర్‌ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయని, థియేటర్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉంది. సెలబ్రీటీలు వస్తే ఫ్యాన్స్ అదుపు చేయడం కష్టం అవుతుందని, సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. హీరో, హీరోయిన్‌, నిర్మాత ఎవరైనా థియేటర్‌కు రావడానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు తెలిపారన్నారు. థియేటర్ పెట్టుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పుష్ప-2 ప్రీమియర్‌ షో రోజున హీరో అల్లు అర్జున్‌ థియేటర్‌ కు వచ్చారన్నారు.

ఈ ఘటనలో హీరో తప్పు ఉందని పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు వెళ్లే..వారితో అనుచితంగా ప్రవర్తించారన్నారు. అందుకే అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్తే రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ బూతులతో ట్వీట్ పెట్టారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీసే ఘటనలు జరుగుతుంటే ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం