Rajanna Sircilla Police : మైనర్లు వాహనాలు నడిపితే పేరెంట్స్ జైలుకే..! పోలీసుల హెచ్చరికలు
మైనర్ లు బైక్ నడిపి ప్రమాదాలకు కారణమైతే పేరెంట్స్ తో పాటు వాహన యజమాని జైలుకు వెళ్ళక తప్పదని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు… వాహనాలు నడిపిన 285 మంది మైనర్ల ను పట్టుకున్నారు. మైనర్లతో పాటు వారి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మైనర్ల డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 285 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పటైటుబడ్డారు. ఆ వాహనాలను సీజ్ చేసి, పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. మొదటి తప్పుగా భావిస్తూ ఈ చాలాన్ల కింద జరిమాన విధిస్తూ వాహనాలు వదిలి పెట్టారు.
మరోసారి పట్టుబడితే కేసులు తప్పవు..ఎస్పీ
తరచు మైనర్ లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమేనని కావున ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని పేరెంట్స్ కు హితవు పలికారు. తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణం అవుతున్నారని తెలిపారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ చేయడం వలన ఒక వ్యక్తి మరణించాడని ఆ మైనర్ తల్లిదండ్రులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
మైనర్ డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమై ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తే 10 సంవత్సరాల కఠిన శిక్షలు పడేలా చట్టాలు ఉన్నాయని చెప్పారు. తల్లిదండ్రులు, వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వద్దన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడవలసి వస్తుందని పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు.
రోడ్డు భద్రతపై క్లాసులు...
మైనర్ల డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్ తో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ కిడ్స్ పేరుతో రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ వినియోగం రోడ్డు సేఫ్టీ పై పిల్లలకు తరగతి గదిలో అవగాహన కల్పించడం ద్వారా పిల్లలు ఇంటికి వెళ్లి పెద్దలకు చెప్పే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ తో మైనర్ ల డ్రైవింగ్ ను కట్టడి చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం