Vijayawada traffic Alert: నేడు విజయవాడలో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Vijayawada traffic Alert: విజయవాడలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరం అంతట ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
Vijayawada traffic Alert: విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ నేపథ్యంలో నగరం అంతటా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో పాఠశాలలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. స్వర్ణాంద్ర @2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
స్వర్ణాంధ్ర కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్.పి లు మంత్రులు ఇతర వి.ఐ.పి.,లు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బందోబస్తులో పాల్గొనే అధికారులు,సిబ్బంది వారికి కేటాయించిన విధులను అంకిత భావంతో నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అన్ని శాఖల సమన్వయంతో బందోబస్త్ నిర్వహించాలని, వీక్షకులకు, ఆహ్వానితులకు వారికి కేటాయించిన ప్రకారం వారు వెళ్ళాల్సిన మార్గాలను నిర్దేశించాలని సీపీ రాజశేఖర్‌బాబు సిబ్బందికి ఆదేశించారు.
స్టేడియం లోపలకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆ తరువాత మాత్రమే సభా ప్రాంగణం లోనికి అనుమతించాలని, నగరంలని ముఖ్య ప్రాంతాలలో మరియు ముఖ్య జంక్షన్ లలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా ఉండేందుకు సిబ్బందిని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పర్యవేక్షించాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తమ వాహనాలు పార్కింగ్ ప్రదేశాల్లోనే పార్కింగ్ చేసేటట్లు చూడాలని వి.ఐ.పి, వి.వి.ఐ.పి రోడ్లలలో ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని అందరూ అంకితభావంతో పనిచేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.
విజయవాడ నగరంలో ట్రాఫిక్ మళ్ళింపులు
విశాఖపట్నం నుండి వచ్చు ఆర్.టి.సి. బస్సులు రామవరప్పాడు రింగు –గుణదల –పడవల రేవు- బి.ఆర్.టి.యస్ రోడ్డు- జి.యస్.రాజు రోడ్డు-ఏలూరు లాకులు- పాత గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు-పి.సి.ఆర్.జంక్షన్-పి.యన్.బి.యస్.కు వెళ్ళవలయును
మచిలీపట్నం నుండి వచ్చు ఆర్.టి.సి. బస్సులు –ఆటోనగర్ గేటు –బెంజ్ సర్కిలు –మహానాడు-రామవరప్పాడు- ఏలూరురోడ్డు- గుణదల- చుట్టుగుంట -దీప్తిజంక్షన్- అప్సర జంక్షన్- పి.సి.ఆర్ .-పి.యన్.బి.యస్.కు వెళ్ళవలయును
పి.యన్.బి.యస్ నుండి విశాఖపట్నం వెళ్ళు ఆర్.టి.సి.బస్సులు –పి.సి.ఆర్.జంక్షను -ఆర్.టి.సి. y జంక్షన్- చల్లపల్లి బంగ్లా- హనుమాన్ పేట –ఏలూరు లాకులు- జి.యస్.రాజు రోడ్డు –బి.ఆర్.టి.యస్ రోడ్డు- పడవల రేవు జంక్షన్ –గుణదల –రామవరప్పాడు రింగ్-విశాఖపట్నం వైపు వెళ్ళవలెను
పి.యన్.బి.యస్ నుండి మచిలీపట్నం మరియు గుడివాడ వెళ్ళు ఆర్.టి.సి.బస్సులు –పి.సి.ఆర్.జంక్షను ఆర్.టి.సి.Y జంక్షను –చల్లపల్లి బంగ్లా- విజయా టాకీసు- దీప్తి జంక్షన్- చుట్టుగుంట –మాచవరం –పడవల రేవు జంక్షను –గుణదల –రామవరప్పాడు రింగ్-ఎనికెపాడు జంక్షను వద్ద నుండి తాడిగడప 100 అడుగులు రోడ్డు మీదుగా వెళ్ళ వలయును
బెంజ్ సర్కిలు నుండి బందరు రోడ్డు మీదుగా పి.సి.ఆర్ వైపుకు వెళ్ళు సిటీ బస్సులు బెంజి సర్కిలు నుండి –
మహానాడు-రామవరప్పాడు—ఏలూరురోడ్డు-గుణదల –చుట్టుగుంట -దీప్తిజంక్షన్- అప్సర జంక్షన్-పి.సి.ఆర్.- పి.యన్.బి.యస్.కు వెళ్ళవలయును బందర్ రోడ్డు పై ఆర్.టి.సి.బస్సులు మరియు ఆటోలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించబడవు
బెంజి సర్కిలు నుండి బందరు రోడ్డు పై పోలీసు కంట్రోలు రూమ్ వరకూ మరియు పోలీసు కంట్రోలు రూమ్ నుండి బెంజి సర్కిలు వరకు “స్వర్ణాంధ్ర విజన్-2047” వచ్చు వాహనములు తప్ప ఏ విధమైన ఇతర వాహనములు అనుమతించరు. “స్వర్ణాంధ్ర విజన్-2047” వచ్చు వాహనములు మాత్రమె అనుమతించబడును
విజయవాడ ఏలూరు రోడ్డు సీతారామపురం సిగ్నల్ జంక్షను (దీప్తి జంక్షన్ ) నుండి ఆర్.టి.ఏ. జంక్షన్ వరకూ (ఈట్ స్ట్రీట్ వైపుకు) “స్వర్ణాంధ్ర విజన్-2047” వచ్చు వాహనములు తప్ప ఏ విధమైన వాహనములు అనుమతించరు.
విజయవాడ శిఖామణి సెంటర్ నుండి చుట్టుగుంట సెంటరు మరియు వాటర్ ట్యాంక్ రోడ్డు లోనికి బందరు రోడ్డు వైపుకు ఏవిధమైన వాహనములు అనుమతించరు.
అంబులెన్స్‌లకు మాత్రమే అనుమతి..
108 అంబులెన్సు మరియు యితర అత్యవసర వాహనములు నగరములో ఏమార్గములో నైన వెళ్లవచ్చునని వాటిని అనుమతించ వలసినదిగా పోలీసు వారికి సూచించారు.
“స్వర్ణాంధ్ర విజన్-2047” వచ్చిన ఏ వాహనములు నగరములోని రోడ్లపై నిలుపకుండ, ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా చూడవలెనని పోలీస్ వారి సూచన.
ఉద్యోగులకు ఆంక్షలు..
యం.జి. రోడ్డులో ముఖ్యమంత్రి గారి విజన్-2047 కార్యక్రము ఉన్నందున, కావున బెంజ్ సర్కిలు నుండి పిసి.ఆర్ వరకు బందర్ రోడ్ లో పనిచేసే ఉద్యోగులు, షాపుల యజమానులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి షాపులకు , కార్యాలయములకు వెళ్లే వారు ఉదయం 8 గంటల లోపు వారి ఆఫీసులకు , షాపులకు వెళ్ళ వలసినదిగా సూచించారు.
విజయవాడ మీదుగా వెళ్లే వాహనాల మళ్లింపు
విజయవాడ వెలుపల భారీ మరియు మద్యతరహా రవాణా వాహానముల రాకపోకల మళ్లింపులు
హైదరాబాద్ నుండి విశాఖపట్నం మరియు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపుకు భారీ మరియు మద్యతరహా రవాణా వాహానముల రాకపోకల మళ్లింపులు:
ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్ళించ బడును. (ఇరువైపులా).
విశాఖపట్నం నుండి చెన్నై మరియు చెన్నై నుండి విశాఖపట్నం వైపుకు భారీ మరియు మద్యతరహా రవాణా వాహానముల రాకపోకల మళ్లింపులు:
హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ – పామర్రు - అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల - త్రోవగుంట – ఒంగోలు జిల్లా మీదుగా మళ్ళించ బడును. (ఇరువైపులా).
గుంటూరు నుండి విశాఖపట్నం మరియు విశాఖపట్నం నుండి గుంటూరు వైపుకు భారీ మరియు మద్యతరహా రవాణా వాహానముల రాకపోకల మళ్లింపులు:
గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు వద్ద , తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ –హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్ళించ బడును. (ఇరువైపులా)
చెన్నై నుండి హైదరాబాద్ మరియు హైదరాబాద్ నుండి చెన్నై వైపుకు భారీ మరియు మద్యతరహా రవాణా వాహానముల రాకపోకల మళ్లింపులు:
చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు,నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను. (ఇరువైపులా)