Germany Attack: రద్దీగా ఉన్న క్రిస్టమస్ మార్కెట్లో కారుతో సౌదీ డాక్టర్ బీభత్సం
Germany Christmas market: జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్ లోకి సౌదీ అరేబియాకు చెందిన ఒక డాక్టర్ వేగంగా కారుతో దూసుకెళ్లడంతో, కారు ఢీ కొని ఇద్దరు మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
Germany Attack: జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లో విషాదం చోటు చేసుకుంది. మార్కెట్లోకి ఉద్దేశపూర్వకంగా సౌదీ అరేబియాకు చెందిన ఒక డాక్టర్ కారుతో దూసుకెళ్తూ, అక్కడివారికి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 68 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సౌదీ జాతీయుడిని అరెస్టు చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో మార్కెట్ హాలిడే షాపర్లతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
నిందితుడి అరెస్ట్
జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో ఘటనా స్థలంలో ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నారు. 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో రెండు వరుసల మార్కెట్ స్టాల్స్ మధ్య నడుస్తున్న జనం మధ్య కారు అక్కడున్నవారిని ఢీ కొడుతూ వేగంగా వెళ్తోంది. ప్రజలు కారు కింద పడిపోవడం, కొందరు దూరంగా పరుగులు తీయడం ఆ వీడియోలో చూడవచ్చు. 2016లో బెర్లిన్ లో ఓ డ్రైవర్ ట్రక్కును జనంలోకి దూసుకెళ్లి 13 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన తరహాలో ఉంది.
నిందితుడి వివరాలు
- నిందితుడిని సౌదీ అరేబియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
- 2006లో జర్మనీకి వెళ్లిన ఆయనకు శాశ్వత నివాస అనుమతి ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి తమారా జిస్చాంగ్ తెలిపారు.
- మాగ్డేబర్గ్ కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెర్న్ బర్గ్ లో ఆయన డాక్టర్ గా ప్రాక్టిస్ చేస్తున్నారు.
- "పరిస్థితులు చూస్తుంటే, అతను ఒంటరిగానే ఈ నేరానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కాబట్టి మాకు తెలిసినంత వరకు, నగరానికి ఇతరత్రా ముప్పేమీ లేదు" అని సాక్సోనీ-అన్హాల్ట్ గవర్నర్ రైనర్ హసెలోఫ్ విలేకరులతో చెప్పారు.
- దాడికి గల కారణాలు తెలియరాలేదు. స్థానిక బ్రాడ్ కాస్టర్ ఎండిఆర్ ప్రకారం, అనుమానితుడు ఇస్లామిక్ గా జర్మన్ అధికారులకు తెలియదు.
- ఈ దాడిని ఖండించిన సౌదీ అరేబియా విదేశాంగ శాఖ జర్మనీ ప్రజలకు, మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపింది.
- సౌదీ అరేబియా ఈ హింసను ఖండిస్తున్నట్లు పేర్కొంది. కానీ నిందితుడి గురించి ఏమీ ప్రస్తావించలేదు.